ఎన్నికల్లో ఓటమిపై పోస్టుమార్టం మొదలుపెట్టిన జనసేన
ఎన్నికల్లో ఓటమిపై పోస్టుమార్టం మొదలు పెట్టిన జనసేన.. పార్టీ సంస్థాగత బలోపేతంపై ఫోకస్ పెట్టింది. పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన పవన్ కల్యాణ్.. ఓటమికి కారణాలు, పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటుపై చర్చించారు. పార్టీని గ్రామస్థాయిలో ఎలా బలోపేతం చేయాలన్నదానిపై నేతలతో సమాలోచనలు చేశారు. వైసీపీ ప్రభుత్వ పనితీరుపై కొన్ని రోజులు వేచి చూడాలని జనసేన నిర్ణయించింది.
పార్టీ బలోపేతం కోసం రాష్ట్రస్థాయి కమిటీలు వేయాలని నిర్ణయించామన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. త్వరలోనే కమిటీలను పూర్తిచేసి పార్టీ బలోపేతం దిశగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. పార్టీలోకి ఎవరూ వచ్చిన స్వాగతిస్తామన్నారు జనసేన అధినేత
గతంలో టీడీపీ ప్రభుత్వానికి సమయం ఇచ్చినట్లే వైఎస్ జగన్ ప్రభుత్వానికి సమయం ఇస్తామన్నారు పవన్. ఏడాదిపాటు వైసీపీ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయమన్నారు. ప్రజలకు ప్రభుత్వం మంచి చేస్తే సహకరిస్తామని.. ప్రజా వత్యిరేక నిర్ణయాలు తీసుకుంటే తిరగబడతామన్నారు.
ప్రభుత్వం వచ్చి నెల రోజులు గడవకముందే పార్టీలు మారడం మంచి పద్ధతి కాదన్నారు పవన్. కొందరు నేతలు అభద్రతా భావంతోనే పార్టీ మారుతుండొచ్చని అన్నారు. జమిలి ఎన్నికలను జనసేన స్వాగతిస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
పార్టీ కమిటీలు పూర్తయ్యాక పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించాలని జనసేన నిర్ణయించింది. గ్రామ స్థాయిలో పార్టీ సత్తా చాటాలని భావిస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com