అప్పట్లో జయసూర్య.. ఇప్పుడు షకీబుల్..

అప్పట్లో జయసూర్య.. ఇప్పుడు షకీబుల్..
X

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతోన్న ప్రపంచకప్‌ బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబుల్ కెరీర్‌లోనే గుర్తుండిపోనుంది. టోర్నీ ఆరంభం నుండీ షకీబుల్ తనదైన ముద్ర వేస్తున్నాడు. జట్టులో సీనియర్ ఆటగాడిగా ఉన్న షకీబుల్ ప్రతీ మ్యాచ్‌లోనూ అద్భుతమైన ప్రదర్శనతో ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో సంచలనాలు సృష్టించడం బంగ్లాకు అలవాటే. ఈ సారి కూడా ఆ జట్టు సౌతాఫ్రికాకు షాకిచ్చి... ప్రస్తుతం సెమీస్‌ రేసులో మిగిలిన జట్లతో పోటీపడుతోంది. అయితే ఈ విజయాల్లో షకీబుల్‌ రోల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బంగ్లా సాధించిన మూడు విజయాల్లోనూ అదరగొట్టిన ఈ ఆల్‌రౌండర్ ఇప్పుడు టోర్నీలోనే మోస్ట్ రన్స్ జాబితాలో నిలిచాడు. 7 మ్యాచ్‌లు ఆడిన షకీబుల్‌హసన్ 476 పరుగులు చేయగా... ఆరు మ్యాచ్‌లలో కనీసం హాఫ్ సెంచరీ సాధించడం ఇక్కడ హైలెట్‌. షకీబుల్ జోరులో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

సౌతాఫ్రికాపై 75 , న్యూజిలాండ్‌పై 64 , ఇంగ్లాండ్‌పై 121 , విండీస్‌పై 124 , ఆస్ట్రేలియాపై 41 , ఆఫ్ఘనిస్థాన్‌పై 51 పరుగులతో రాణించాడు. ప్రపంచకప్‌లో పలువురు స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ ఉండగా.. బంగ్లాదేశ్‌కు చెందిన ఆల్‌రౌండర్‌ ఇలా అగ్రస్థానంలో నిలవడం ఆశ్చర్యమే. మోస్ట్ ఫోర్స్‌ జాబితాలోనూ షకీబుల్‌ టాప్ ప్లేస్‌లో ఉండగా.. బౌలింగ్‌లోనూ సత్తా చాటి 10 వికెట్లతో టాప్ టెన్‌లో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో పలు రికార్డులు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

ప్రపంచకప్‌ మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన తొలి బంగ్లాదేశ్‌ బౌలర్‌ షకీబే... ఒక ప్రపంచకప్‌లో సెంచరీ, ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన మూడో ఆటగాడు కూడా అతడే. షకీబ్ కంటే ముందు కపిల్‌దేవ్ , యువరాస్‌సింగ్ నిలిచారు. ఇదిలా ఉంటే ప్రపంచకప్‌లో వెయ్యికి పైగా పరుగులు, 25కు పైగా వికెట్లు సాధించిన రెండో ఆల్‌రౌండర్‌గా షకిబ్‌ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు సనత్‌ జయసూర్య మాత్రమే ఈ ఘనత సాధించాడు. షకీబ్‌ ప్రస్తుతం 1016 పరుగులు, 33 వికెట్లతో కొనసాగుతున్నాడు.

షకీబుల్ జోరుతోనే మూడు కీలక విజయాలు సాధించిన బంగ్లాదేశ్‌ ప్రస్తుతం సెమీస్‌ రేసులో నిలిచింది. రానున్న మ్యాచ్‌లు పెద్ద జట్లతో ఆడాల్సి ఉన్నప్పటకీ...సంచలనాలు బంగ్లాకు కొత్తకాదు. అయితే షకీబుల్‌ ఇదే జోరు కొనసాగిస్తే మాత్రం బంగ్లాదేశ్ సెమీస్‌లో అడుగుపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి.

Tags

Next Story