తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణానికి వడివడిగా అడుగులు

విపక్షాల అభ్యంతరాలు, కోర్టు కేసులు ఎలా ఉన్నా.. తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయ నిర్మాణానికి వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రస్తుత సెక్రటేరియెట్ ప్రాంతంలోనే ఉన్న నిర్మాణాలను కూల్చేసి.. కొత్తది కట్టబోతున్నారు. ఇందుకు సంబంధించి ఈనెల 27న శంకుస్థాపన చేయనున్నారు. ఆ భూమి పూజకు స్థలం ఎక్కడన్నది కూడా ఖరారు చేశారు. అందుకు ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయి. సచివాలయ ప్రాంగణంలోని D బ్లాక్ పోర్టికో ఎదురుగా ఉన్న పార్కులో ఎల్లుండి కేసీఆర్ శాస్త్రోక్తంగా పూజాదికాలు చేసి.. పునాదిరాయి వేయనున్నారు. వాస్తు ప్రకారం పక్కాగా కొత్త సచివాలయ నిర్మాణం జరగబోతోంది.
ఈ గురువారం సచివాలయంతోపాటు కొత్త శాసనసభ నిర్మాణానికి కూడా కేసీఆర్ భూమి పూజ చేస్తారు. సచివాలయాన్ని ఉన్నచోటనే కొత్తది కడుతుంటే.. అసెంబ్లీని ఎర్రమంజిల్ ప్రాంతంలో నిర్మించనున్నారు. అసెంబ్లీ విషయంలో ప్రస్తుత భవనానికి దగ్గరగా ఉండే నమూనానే కేసీఆర్ ఖరారు చేశారు. సచివాలయం విషయంలో మాత్రం 2 మోడల్స్ పరిశీలిస్తున్నారు. ముంబైకి చెందిన ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ ఇచ్చిన మోడల్, చెన్నైకి చెందిన ఆస్కార్ అండ్ పొన్ని సంస్థ ఇచ్చిన డిజైన్ ఇప్పటికే కేసీఆర్ టైబుల్‌పై ఉన్నాయి. ఈ రెండింట్లోనూ ఏది ఉత్తమన్నదానిపై అధికారులతో కూడా మాట్లాడాక ఒకటి ఫైనల్ చేయనున్నారు. దాదాపు 400 కోట్ల రూపాయలతో సచివాలయ నిర్మాణం పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతమున్న సచివాలయంలో భూమిపూజ తర్వాత పాత బ్లాక్‌లు ఒక్కొక్కటీ కూల్చేస్తారు. 10 బ్లాక్‌లను నేలమట్టం చేశాక.. అప్పుడు కొత్త ప్లాన్ ప్రకారం నిర్మాణాలు షురూ చేస్తారు. 25 ఎకరాల స్థలంలో ప్రధాన భవన సముదాయం ఎక్కడ వస్తుంది.. పార్కింగ్ ఎక్కడ ఉండాలి అనే అంశాలపైనా నిర్దిష్టమైన సూచనలు చేశారు ముఖ్యమంత్రి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com