ఇప్పటి వరకూ వరల్డ్‌కప్ గెలవని ఆ జట్టుపైనే ఆశలు..!

ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లు ఇప్పుడు రసవత్తరంగా మారాయి. వర్షాలతో డీలా పడ్డ జట్లు అనూహ్య పోరాటాలతో సంచలనాలు సృష్టిస్తున్నాయి. నాకౌట్ దశ సమీపిస్తుండటంతో తొలి నాలుగు స్థానాలకు తీవ్ర పోటీ నెలకొంది. నాలుగో స్థానంలో కొనసాగుతున్న ఇంగ్లాండ్‌పైనే అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత ప్రపంచకప్ టైటిల్ రేసులో ఉన్న ఇంగ్లాండ్‌పై మొదటి నుండీ భారీ అంచనాలే ఉన్నాయి. క్రికెట్ పుట్టినిల్లయిన ఆ జట్టు ఇప్పటి వరకూ వరల్డ్‌కప్ గెలవకపోవడంతో సొంతగడ్డపై తమ కల నెరవేరుతుందని ఇంగ్లాండ్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. దీనికి తగ్గట్టే గత కొంత కాలంగా ఇంగ్లీష్ టీమ్ ఫామ్ అద్భుతంగా ఉండడంతో ఫేవరెట్స్‌లో ఒకటిగా భావించారు. అయితే పాకిస్థాన్ , శ్రీలంక జట్లపై ఓటమితో ఇంగ్లాండ్ పరిస్థితి ఇబ్బందిగా మారింది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లో నాలుగు విజయాలు, రెండు ఓటములతో 8 పాయింట్లు సాధించిన ఆతిథ్య జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. తర్వాత ఆడాల్సిన మ్యాచ్‌లన్నీ పెద్ద జట్లతోనే కావడంతో ఇంగ్లాండ్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. సెమీస్ బెర్త్ దక్కాలంటే కనీసం రెండు మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా, భారత్‌లతో జరిగే మ్యాచ్‌లే ఇంగ్లీష్ టీమ్‌కు కీలకం కానున్నాయి. నాలుగు మ్యాచ్‌లలో పరుగుల వరద పారించిన ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్... లంకపై మాత్రం చేతులెత్తేశారు. మరి మంచి బౌలింగ్ లైనప్స్ ఉన్న ఆసీస్,భారత్‌లపై ఏ మేర నిలబడతారో చూడాలి.
మరోవైపు టాప్ ఫోర్ కింద బంగ్లాదేశ్ అదరగొడుతోంది. మూడు మ్యాచ్‌లు ఓడినా.. మూడు విజయాలతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. తర్వాతి మ్యాచ్‌లలో బలమైన జట్లతో తలపడాల్సి ఉండగా.. సంచలనాలు సృష్టించే అవకాశాలూ లేకపోలేదు. మిగిలిన మ్యాచ్‌లలో గెలిచి... ఇంగ్లాండ్ మూడు మ్యాచ్‌లలో ఓడితే బంగ్లాకు సెమీస్ చాన్స్ ఉంటుంది. అంచనాలు పెద్దగా ఉండవు కాబట్టి బంగ్లాదేశ్ చివరి వరకూ పోరాడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఆ జట్టును తేలిగ్గా తీసుకుంటే మాత్రం మిగిలిన జట్లకు కష్టాలు తప్పవు. అటు భారత్‌తో మ్యాచ్‌లో చిత్తుగా ఓడి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పాకిస్థాన్ మళ్ళీ పుంజుకుంది. దక్షిణాఫ్రికాను చిత్తుచేసి సెమీఫైనల్‌పై ఆశలు పెట్టుకుంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో రెండు మాత్రమే గెలవగా... మూడింట్లో ఓటమిపాలైంది. మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిస్తేనే పాక్ రేసులో ఉంటుంది. అదే సమయంలో ఇంగ్లాండ్ తాను ఆడే మూడింటిలోనూ ఓడిపోతేనే పాకిస్థాన్‌కు సెమీస్ బెర్త్ దక్కుతుంది. మిగిలిన జట్లలో శ్రీలంక , వెస్టిండీస్‌లకు పెద్దగా అవకాశాలు లేవు. దీంతో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్‌పైనే అందరి దృష్టీ ఉంది. ఆ జట్టు చెత్త ప్రదర్శన కనబరిస్తే మాత్రం సెమీస్ రేసులో బంగ్లాదేశ్, పాకిస్థాన్‌కు అవకాశముంటుంది. ఓవరాల్‌గా ఈ వారం జరిగే లీగ్ మ్యాచ్‌లతో సెమీఫైనల్ బెర్తులు దాదాపు ఖరారు కానున్నాయి.
Tags
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com