రాజశేఖర్‌ 'ఆమె'ను చేసుకోవల్సింది.. కానీ నన్ను..: జీవిత

రాజశేఖర్‌ ఆమెను చేసుకోవల్సింది.. కానీ నన్ను..: జీవిత

ఒకరితో ప్రేమ.. మరొకరితో పెళ్లి.. అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని అని ఓ సినీ గేయ రచయిత చెప్పినట్లు ఎవరితో ఎవరికి రాసి పెట్టి ఉంటే వారితోనే పెళ్లిళ్లు అవుతాయంటారు పెద్దలు. అది అక్షరాలా నిజమేనేమో. టాలీవుడ్ మోస్ట్ ఫేవరబుల్ జంట జీవితా రాజశేఖర్‌ల ప్రేమా పెళ్లి కథలో కూడా సినిమాను తలపించే ట్విస్ట్ ఉంది. వారి జీవితంలోని ఆసక్తికర సంగతులను జీవిత అప్పట్లో ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది..

పెళ్లికి ముందే నేను, రాజశేఖర్ చాలా సన్నిహితంగా ఉండేవాళ్లం. షూటింగుల నిమిత్తంగా వేర్వేరు రూములు కేటాయించినా ఒకే రూమ్‌లో ఉండేవాళ్లం. అయినా ఆయనతో నాకు ఎలాంటి ఇబ్బందీ ఉండేది కాదు. మా రిలేషన్ షిప్ గురించి మా అమ్మా నాన్న చాలా కంగారు పడేవాళ్లు. ఒకవేళ పెళ్లి చేసుకోనంటే ఏం చేస్తావనే వారు. ఆయనకి ఓ మంచి స్నేహితురాల్లానే ఉండిపోతాననే దాన్ని కానీ పెళ్లి చేసుకోలేకపోయానని ఎప్పుడూ బాధపడనని చెప్పేదాన్ని. అనుకున్నట్టుగానే ఆయనకి ఇండస్ట్రీలోని అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. అయితే ఆమె హీరోయిన్ మాత్రం కాదు (పేరు చెప్పను). రాజశేఖర్ కూడా వాళ్ల తల్లిదండ్రుల మాటకి తలొగ్గారు. ఆ అమ్మాయిని నాకు పరిచయం చేశారు రాజశేఖర్. ఆమె నాతోనే చదువుకుంది. నాకు సీనియర్. ఓ రోజు ముగ్గురం కలిసి గుడికి వెళ్లాం.

ముందు సీట్లో ఆయన, తను.. ఎప్పుడూ ఆయన పక్కన కూర్చునేను ఆరోజు వెనుక సీట్లో కూర్చున్నాను. ఆ రోజు ముగ్గురం బాగానే మాట్లాడుకున్నాం. గుడిలో దేవుడి దర్శనం అయ్యాక ఎవరి ఇళ్లకు వాళ్లం వెళ్లి పోయాం. ఆ తరువాత కూడా మా ఇద్దరి సినిమాలు వచ్చేవి. పెళ్లి నిశ్చయమవడంతో రాజశేఖర్‌ని చేసుకోబోయే ఆవిడ నాతో రిలేషన్ కట్ చేయమని చెప్పింది. వాళ్ల ఇంట్లో వాళ్లు కూడా అదే చెప్పారు. అందుకు ఆయన ఒప్పుకోలేదు. ససేమిరా నాతో స్నేహాన్ని వదులుకోనని చెప్పారట. అదే విషయాన్ని నాతో చెప్పారు. మీ ఇష్టం.. మీకు ఎది కరెక్ట్ అనిపిస్తే అదే చేయండి అన్నాను నేను. అనంతర పరిణామాల తరువాత ఆమెతో రాజశేఖర్ పెళ్లి క్యాన్సిల్ అయింది. ఆ తరువాత కూడా మూడు సినిమాలు కలిసి చేశాము.

మగాడు సినిమా చేస్తున్న సమయంలో ఆయనకు మేజర్ యాక్సిడెంట్ అయింది. నెలన్నర పాటు హాస్పిటల్‌లో ఉండాల్సి వచ్చింది. ఆయనతో పాటు నేను కూడా హాస్పిటల్‌లోనే ఉన్నాను. ఆ తర్వాత రాజశేఖర్ గారి తల్లిదండ్రులు మనసు మార్చుకుని ఆయన డిశ్చార్జ్ అయిన తరువాత నన్ను కూడా నేరుగా వాళ్ల ఇంటికే తీసుకు వెళ్లారు. మా పెళ్లికి పచ్చ జెండా ఊపారు. యాక్సిడెంట్‌ నుంచి కోలుకోవడానికి ఆయనకు ఏడాది పట్టింది. అప్పుడు పెళ్లి చేసుకుందామనుకుసేరికి మా నాన్నగారు చనిపోయారు. మళ్లీ ఇంకో ఏడాది ఆగి పెళ్లి చేసుకున్నాము అని చెప్పుకొచ్చారు జీవిత వారి ప్రేమా, పెళ్లి ముచ్చట్లను.

Tags

Read MoreRead Less
Next Story