మరో సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం జగన్!
పాలనలో తన ముద్రతో ముందుకు వెళ్తున్నాను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొన్న ప్రజావేదిక కూల్చివేతపై నిర్ణయం తీసుకోగా.. తాజాగా గత పాలనలోని విద్యుత్ కొనుగోళ్లలో 2వేల 636 కోట్ల మేర అక్రమాలు జరిగాయని.. వాటిని రికవరీ చేయాలని ఆదేశించారు. ఈ వ్యవహారంలో ఎంతటివారున్నా వదిలిపెట్టొద్దని అధికారులను సూచించారు. అటు వ్యవసాయానికి పగటిపూటే తొమ్మిది గంటల విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించారు. గత ప్రభుత్వ హయాంలోని కరెంట్ కొనుగోళ్లలో అక్రమాల వల్ల 2 వేల 636 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని.. ఆ నష్టాన్ని రికవరీ చేయాలని ఆదేశించారు. ఈ అక్రమాలను వెలికితీసేందుకు కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. విద్యుత్, ఇంధనశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్.. సోలార్, పవన విద్యుత్ కొనుగోళ్లపై చర్చించారు. బిడ్డింగ్ ధరల కన్నా అధిక రేట్లకు ఎందుకు కొనుగోలు చేశారని సీఎం అధికారులను ప్రశ్నించారు. అక్రమాల వెలికితీతకు ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థల సహకారం తీసుకుంటామని వెల్లడించారు.
సౌర, పవన విద్యుత్ సంస్థలు దారికి రాకపోతే ఒప్పందాలు రద్దు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఒప్పందాలు చేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు మొత్తం 30అంశాలపై విచారణ చేస్తామని జగన్ స్పష్టంచేశారు. ఇకపై విద్యుత్ ఒప్పందాలు పూర్తి పారదర్శకంగా ఉండాలన్నారు. అటు రైతులకు గురువారం నుంచే వ్యవసాయానికి పగటిపూటే తొమ్మిది గంటల విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. తొలుత 60 శాతం ఫీడర్లలో పంపు సెట్లకు సరఫరా చేయాలని సూచించారు. మిగతా 40 శాతం మరో ఏడాది లోపు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అంతకు ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. కార్మికుల ప్రయోజనాలకు నష్టం వాటిల్లకుండా ప్రభుత్వంలో విలీనం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉద్యోగులకు వేతన బకాయిలు, సేకరించిన బ్యాంకు రుణాలు, ప్రస్తుత బాధ్యతలకు సంబంధించిన అంశాలపై అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. ఆర్టీసీని లాభాల బాటలో నడిపించడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు అనుగుణంగా అధ్యయనం చేసి.. మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని సీఎం ఆదేశించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com