ప్రజావేదిక కూల్చివేత.. రాత్రి ఇంటికి వచ్చిన చంద్రబాబు..
ప్రజా వేదిక కూల్చివేత ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే 60 శాతానికి పైగా భవనాన్ని కూల్చివేశారు. జేసీబీల సహాయంతో కూల్చివేత చకచకా సాగిపోతోంది. మరోవైపు ప్రజావేదిక కూల్చివేతపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.. ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయడం సరికాదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు.. అయితే, కృష్ణా కరకట్టపై అక్రమ నిర్మాణాలను ఏ ప్రభుత్వమైనా అనుమతించకూదని, అలాంటిది గత ప్రభుత్వమే దగ్గరుండి ప్రజావేదికను నిర్మించిందని ఏజీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. కోర్టు కూడా ఏజీ వాదనలతో ఏకీభవించింది.. స్టే ఇచ్చేందుకు నిరాకరించిన ధర్మాసనం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. దీంతో కూల్చివేత ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇవాళ సాయంత్రానికి ప్రజావేదిక పూర్తిగా నేలమట్టమయ్యే అవకాశం ఉంది..
కలెక్టర్ల సదస్సు ముగిసిన వెంటనే కూల్చివేత పనులు మొదలు పెట్టిన అధికారులు.. రాత్రంతా దగ్గరుండి పర్యవేక్షించారు.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడమని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిప్రకటించిన కొన్ని గంటల్లోనే... కూల్చివేత చర్యలు షురూ అయ్యాయి.. మొదట భవనంలోని విలువైన ఫర్నిచర్, టెంట్లు, మొక్కలు, ఏసీలను ఇతర ప్రాంతాలకు తరలించే ప్రక్రియను కూడా గంటల్లోనూ పూర్తి చేశారు. సీఆర్‌డీఏ అధికారులు, ఇంజనీర్ల పర్యవేక్షణలో జేసీబీలతో ప్రజావేదిక భవనాన్ని కూలుస్తున్నారు.
కూల్చివేత సందర్భంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు పోలీసులు. ప్రజావేదిక దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ప్రజావేదికతో పాటు కరకట్టను భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తెల్లవారేసరికి ప్రజావేదిక సగానికిపైగా నేలమట్టం అయింది.
విపక్షనేత చంద్రబాబు అర్ధరాత్రి సమయంలో ఉండవల్లి చేరుకున్నారు.. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి కాన్వాయ్‌లో ఆయన ఉండవల్లిలోని తన నివాసానికి వెళ్లారు.. అదే సమయంలో ప్రజావేదిక కూల్చివేత పనులు జరుగుతున్నాయి.. అయితే, అవేం పట్టించుకోకుండానే చంద్రబాబు వెళ్లిపోయారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com