ధోనీ హోటల్.. ఫుల్లుగా లాగించేయడమే.. బిల్లు కట్టక్కర్లా..

ధోనీ హోటల్.. ఫుల్లుగా లాగించేయడమే.. బిల్లు కట్టక్కర్లా..

అభిమానమండీ.. అభిమానం.. ఎంఎస్.ధోనీ అంటే చచ్చేంత అభిమానం. ధోనీ పేరు మీద హోటల్ పెట్టి.. తన హోటల్‌కి వచ్చే వారు ధోనీ అభిమాని అయ్యుంటే చాలు అన్నీ ఫ్రీ అంటున్నాడు పశ్చిమ బెంగాల్ అలిపుర్దువార్ జిల్లాకు చెందిన శంభూ బోస్. బిజినెస్ బాగా సాగాలని ఎక్కడైనా దేవుడి ఫోటోలు పెట్టుకుంటారు. కానీ శంభూ మాత్రం హోటల్ అంతా ధోనీ ఫొటోలతో నింపేశాడు. చిన్నప్పటి నుంచి ధోనీ అంటే అభిమానం.. అతడి ఆటతీరుతో పాటు అతడి వ్యక్తిత్వం అంటే తనకెంతో ఇష్టం అంటాడు. అందుకే హోటల్‌కి వచ్చేవారు ఎవరైనా ధోనీ అభిమాని అని తెలిస్తే చాలు ఎంత ఆనంద పడిపోతాడో. ఎంతైనా తినండి.. ఏమైనా తినండి.. టీ, కాఫీ, టిఫిన్, భోజనం ఏదైనా ఫ్రీ అంటాడు.

ధోనీని గుండెల్లో పెట్టుకున్న అతడి అభిమానానికి ముగ్దులవుతుంటారు హోటల్‌కి వచ్చే కస్టమర్లు. మరీ ఊరికే భోజనం చేస్తే నువు మాత్రం ఎలా నడుపుతావు హోటల్ అంటూ తృణమో, ఫలమో సమర్పించుకుంటారు శంభూ అభిమానం సంపాదించుకున్న కస్టమర్లు. 2011 వరల్డ్ కప్ ఫైనల్లో ధోనీ విన్నింగ్ సిక్సర్ ‌కొట్టిన క్షణాన ఆనందంతో కళ్లలో నీళ్లు వచ్చాయని ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంటాడు. ఏదో ఒక రోజు ధోనీని కలవాలన్నది తన చిరకాల కోరిక అంటున్నాడు శంభూ. కానీ నా కోరిక నెరవేరదని నాకు తెలుసు. ఎందుకంటే టిక్కెట్ కొనుక్కుని స్టేడియంకి వెళ్లి మ్యాచ్ చూసే అంత ఆర్థిక స్థోమత తనకి లేదన్నాడు. అదృష్టం వరించి ధోనీని కలిసే అవకాశమొస్తే నా హోటల్‌కి పిలిచి అన్నం, చేపల కూర కమ్మగా వండి పెడతానంటున్నాడు. ఎందుకంటే ధోనీకి చేపలకూరంటే చాలా ఇష్టమని నాకు తెలుసు అని చెబుతున్నాడు శంభూ బోస్. ఈ విషయం థోనీకి తెలిస్తే అభిమాని అభిమానానికి పులకించి పోయి రెక్కలు కట్టుకుని వాలిపోతాడేమో.

Tags

Read MoreRead Less
Next Story