ఇంగ్లాండ్‌ కల నెరవేరేలా లేదు..

ఇంగ్లాండ్‌ కల నెరవేరేలా లేదు..

సొంతగడ్డపై ప్రపంచకప్ కల నెరవేర్చుకోవాలనుకున్న ఇంగ్లాండ్‌ను పరాజయాల పరంపర వెంటాడుతూనే ఉంది. టోర్నీ ఆరంభంలో వరుస విజయాలతో దూసుకెళ్లి.. ఇప్పుడు తీవ్రంగా నిరాశపరుస్తోంది. పరుగుల వరద పారించిన ఆ జట్టు బ్యాట్స్‌మెన్ టోర్నీ కీలక సమయంలో చేతులెత్తేస్తున్నారు. దీంతో తాజాగా ఆస్ట్రేలియాపైనా ఇంగ్లాండ్ ఓడిపోయింది.

నదవవిన్నింగ్‌లోవరల్డ్‌కప్‌లో హోరాహోరీ మ్యాచ్‌గా భావించిన చిరకాల ప్రత్యర్థుల పోరులో ఆస్ట్రేలియాదే పైచేయిగా నిలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ జట్టులో ఓపెనర్ల ఇన్నింగ్సే హైలైట్‌గా నిలిచింది. ఎప్పటిలానే ఫామ్‌లో ఉన్న వార్నర్, ఫించ్ మరోసారి భారీస్కోరుకు మంచి పునాది వేశారు. వార్నర్ హాఫ్ సెంచరీ చేసి ఔటైనా... కెప్టెన్ ఫించ్ సెంచరీతో అదరగొట్టాడు. ఈ టోర్నీలో అతనికి రెండో శతకం. వీరిద్దరి పార్టనర్‌షిప్‌తో ఆసీస్ 300కు పైగా స్కోర్ చేస్తుందని భావించారు. అయితే ఇంగ్లాండ్ బౌలర్లు పుంజుకోవడంతో కంగారూలు 285 పరుగులే చేయగలిగింది.

ఛేజింగ్‌లో ఇంగ్లాండ్ మొదటి బంతి నుండే తడబడింది. ఆసీస్ పేసర్లు మిఛెల్ స్టార్క్ , బెహర్డాఫ్ చెరొక ఎండ్ నుండీ చెలరేగిపోయారు. దీంతో ఇంగ్లాండ్‌ 124 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ మరోసారి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. లోయర్ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌తో కలిసి ఇంగ్లాండ్‌ను గెలిపించేందుకు పోరాడాడు. అయితే 89 పరుగుల దగ్గర స్టోక్స్ ఔటవడంతో ఆతిథ్య జట్టు ఓటమి ఖాయమైంది. తర్వాత బ్యాట్స్‌మెన్‌ ఔటవడానికి ఎంతో సమయం పట్టలేదు. దీంతో ఇంగ్లాండ్ 44.4 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో ఆస్ట్రేలియా సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోగా... ఇంగ్లాండ్ నాకౌట్ చేరే అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకటైన ఆతిథ్య జట్టు ఇప్పుడు మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తేనే సెమీస్‌కు చేరుతుంది.

Tags

Read MoreRead Less
Next Story