ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రకటించిన కొన్ని గంటల్లోనే షురూ..
ఏపీ రాజధాని అమరావతిలో ప్రజా వేదిక కూల్చివేత యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతోంది. దాదాపు ఇప్పటికే 80 శాతానికి పైగా భవాన్ని కూల్చేశారు. మరో మూడు గంటల్లో కూల్చివేత పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. అర్థరాత్రికే ప్రహరీ గోడ, ప్యాంట్రీ, చిన్న డైనింగ్ హాల్ కూల్చేశారు. తెల్లవారు జాము నుంచి ప్రధాన భవనం కూల్చివేత పనులు శరవేగంగా సాగుతున్నాయి. CRDA అడిషనల్ కమిషనర్ ఈ పనుల్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆర్కే సైతం ఉదయాన్నే అక్కడికి వెళ్లారు. ఈ అక్రమ నిర్మాణం కూల్చివేత విషయంలో ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాన్ని అంతా హర్షిస్తారని ఆయన చెప్తున్నారు. కరకట్టపై ఉన్న మిగతా 60 ఖరీదైన భవనాలు కూడా అక్రమ నిర్మాణాలేనని వాటిపై కూడా తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
రాజధాని ప్రాంతంలో ఉదయం భారీవర్షం కురవడంతో కాసేపు కూల్చివేత పనులకు అంతరాయం కలిగింది. వర్షం తగ్గాక తిరిగి కూలీలు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. ముందు ఇవాళ్టి నుంచి కూల్చివేత పనులు మొదలుపెట్టాలని అనుకున్నా.. అనూహ్యంగా నిన్న రాత్రికే JCBలు అక్కడికి చేరుకున్నాయి. సీఆర్‌డీఏ అధికారుల పర్యవేక్షణలో దీన్ని తొలగించే పనులు మొదలయ్యాయి. గతంలో ఏ అధికారులైతే ప్రజావేదిక నిర్మాణంలో పాలుపంచుకున్నారో అదే అధికారులు ఇప్పుడు దీన్ని కూల్చివేసే పనులను దగ్గరుండి పరిశీలిస్తుండడం విశేషం.
మరోవైపు ఉండవల్లిలోని ఈ ప్రజావేదిక కూల్చివేతపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.. రాష్ట్రప్రభుత్వం హడావుడిగా చేపట్టిన ప్రజావేదిక కూల్చివేతను అడ్డుకోవాలని కోరుతూ సామాజిక కార్యకర్త పోలూరి శ్రీనివాసరావు రాత్రి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. 8 కోట్ల ప్రజాధనంతో నిర్మితమైన ప్రజావేదికపై నిర్ణయం తీసుకునేటప్పుడు అధికారులు, కేబినెట్ సహచరులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు లేదా కనీసం ప్రజాభిప్రాయం తీసుకోవాల్సి ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. అదంతా అక్రమ కట్టడమని సీఎం చెబుతున్నందున.. అలాంటిదేమైనా ఉంటే దానిపై ప్రభుత్వం విచారణ చేపట్టవచ్చన్నారు. ఒకవేళ ఆ నిర్మాణంలో అక్రమాలు జరిగినట్లు తేలితే మాజీ ముఖ్యమంత్రి, లేదా కేబినెట్ మంత్రుల నుంచి ఆ ధనాన్ని వసూలు చేయవచ్చు అని వాదించారు. ఎలాంటి విచారణ లేకుండా, నిజానిజాలు తెలుసుకోకుండా ఆ భవనాన్ని హఠాత్తుగా కూల్చివేయడం సరికాదని వాదనలు వినిపించారు. అయితే, కృష్ణా కరకట్టపై అక్రమ నిర్మాణాలను ఏ ప్రభుత్వమైనా అనుమతించకూదని, అలాంటిది గత ప్రభుత్వమే దగ్గరుండి ప్రజావేదికను నిర్మించిందని ఏజీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. కోర్టు కూడా ఏజీ వాదనలతో ఏకీభవించింది.. స్టే ఇచ్చేందుకు నిరాకరించిన ధర్మాసనం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. దీంతో కూల్చివేత ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.
కలెక్టర్ల సదస్సు ముగిసిన వెంటనే కూల్చివేత పనులు మొదలు పెట్టిన అధికారులు.. రాత్రంతా దగ్గరుండి పర్యవేక్షించారు.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడమని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిప్రకటించిన కొన్ని గంటల్లోనే... కూల్చివేత చర్యలు షురూ అయ్యాయి.. సీఆర్‌డీఏ అధికారులు, ఇంజనీర్ల పర్యవేక్షణలో జేసీబీలతో ప్రజావేదిక భవనాన్ని కూలుస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com