మరాఠా కోటాపై ముంబయి హైకోర్టు సంచలన తీర్పు

మరాఠా కోటాపై బాంబే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రిజర్వేషన్లు కల్పించడాన్ని సమర్థించింది. దీంతో ఫడ్నవీస్ సర్కారుకు భారీ ఊరట లభించినట్లైంది. అయితే ఈ కోటాను 16 శాతం నుంచి కొంత తగ్గించాలని ఆదేశించింది న్యాయస్థానం. రిజర్వేషన్ల కోసం మరాఠాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడంతో 16 శాతం రిజర్వేషన్లను కల్పించింది మహారాష్ట్ర ప్రభుత్వం. గత ఏడాది నవంబరు 30న విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును..శాసన సభ ఆమోదించింది. సాంఘికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతికి చెందినవారిగా మరాఠాలను గుర్తించింది. ఈ బిల్లును సమర్థిస్తూ, వ్యతిరేకిస్తూ కొన్ని పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్ రంజిత్ మోరే, జస్టిస్ భారతి డాంగ్రే డివిజన్ బెంచ్ ఫిబ్రవరి 6 నుంచి విచారణ జరిపింది. ప్రభుత్వం ఈ బిల్లును సమర్థిస్తూ వాదనలు వినిపించింది. చాలా కాలం నుంచి నిర్లక్ష్యానికి గురైన మరాఠాలను అభివృద్ధి చేసే ఉద్దేశంతోనే ఈ రిజర్వేషన్లను కల్పిస్తున్నట్లు తెలిపింది.
మరాఠా కోటాను వ్యతిరేకించిన పిటిషనర్లు తమ వాదనలో ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. మరాఠాలకు శాశ్వత ఊత కర్రలను ఇచ్చారని, వీటిని వారు ఎన్నటికీ వదిలిపెట్టరని ఆరోపించారు. సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలంటూ కొత్త కేటగిరీని సృష్టించడం ద్వారా ప్రభుత్వం సమానత్వ సిద్ధాంతాన్ని నాశనం చేసిందని వాదించారు. సుదీర్ఘంగా జరిగిన వాదనల తర్వాత మరాఠా కోటా బిల్లును సమర్థిస్తూ తీర్పునిచ్చింది హైకోర్టు. వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని పేర్కొంది. అయితే 16 శాతం కాకుండా విద్యా సంస్థల్లో 12 శాతం, ప్రభుత్వోద్యోగాల్లో 13 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశించింది. రిజర్వేషన్లు 50 శాతం కన్నా మించకూడదని, అయితే, వెనుకబడిన తరగతుల కమిషన్ చెప్పినట్లుగా కొన్ని ప్రత్యేక, అసాధారణ సందర్భాల్లో ఈ పరిమితిని మించవచ్చని పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com