మిగిలిన నిర్మాణాలపై దృష్టిపెట్టిన జగన్ సర్కార్
అమరావతి నిర్మాణాలపై ముఖ్యమంత్రి జగన్ దృష్టి పెట్టారు.. అయితే, ఈ ఫోకస్ అభివృద్ధి మీద కాకుండా.. అవినీతిని బయటకు తీయడంపైనే ఎక్కువగా గత ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణంలో అవినీతి జరిగిందని మొదటి నుంచి చెబుతున్న జగన్.. సీఆర్డీయే అధికారులతో నిర్వహించిన సమీక్షలో కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. దాదాపు మూడు గంటలపాటు సమీక్ష సమావేశం జరిగింది. అమరావతి పరిధిలోని అక్రమ నిర్మాణాలు, బలవంతపు భూసమీకరణతో పాటు, రాజధానికి నిర్మాణాలకు సంబంధించిన పలు అంశాలపై సమీక్షలో చర్చించారు. ఈసందర్భంగా అమరావతి నిర్మాణాల్లో ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో తేల్చాలని సీఆర్డీయే అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
అటు అమరావతి భూమల వ్యవహారంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భూ సేకరణలో బలవంతం లేదని.. ఇష్టం లేని వారు భూములు తిరిగి తీసుకోవచ్చని చెప్పారు. రాజధాని ప్రాంతం మొత్తం అవినీతి కూపంలా ఉందని... ఏది ముట్టుకున్నా అవినీతే కనిపిస్తోందని కొత్త ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంలో మరింత లోతుగా పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్లాట్ల కేటాయింపులో అనుయాయులకు ప్రాధాన్యం ఇచ్చారని... అక్రమాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని చెప్పారు.
అయితే, అవినీతి కూపం నుంచి బయటపడిన తర్వాతే నిర్మాణాలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై అధికారులతో త్వరలో మరోసారి సమావేశం నిర్వహించనున్నారు జగన్.. ఆ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని బొత్స స్పష్టం చేశారు.
ఇప్పటికే ప్రజావేదిక అక్రమమంటూ కూల్చివేసిన జగన్ సర్కార్ .. మిగతా వాటిపైనా దృష్టి పెట్టింది. కృష్ణా తీరం కరకట్ట వెంబడి ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేతపైనా సమీక్షలో చర్చించనట్లుగా సమాచారం. కరకట్ట అక్రమకట్టడాల తొలగింపు ప్రజావేదికతో మొదలైందని.. కొనసాగిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com