తెలంగాణలో కొత్త చరిత్రకు నాంది.. రూ. 5 వందల కోట్ల అంచనా వ్యయంతో..

తెలంగాణలో కొత్త చరిత్రకు నాంది.. రూ. 5 వందల కోట్ల అంచనా వ్యయంతో..

తెలంగాణ కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాలకు పునాది రాయి పడింది. అంత్యంత శాస్త్రోక్తంగా రెండు భవనాలకు భూమి పూజ నిర్వహించారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. దాదాపు 5 వందల కోట్ల అంచనా వ్యయంతో రెండు భవనాలను నిర్మిస్తున్న ప్రభుత్వం.. వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని పట్టుదలతో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కొత్త అసెంబ్లీ, సచివాలయం నిర్మించాలన్న ప్రభుత్వ ఆలోచన ఎట్టకేలకు కార్యారూపం దాల్చింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాలకు శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఉదయం 10 గంటల 45 నిమిషాలకు ముందుగా సచివాలయానికి కేసీఆర్‌ భూమి పూజ చేశారు. సచివాలయంలోని డి బ్లాక్‌ వెనుక భాగం పోర్టికో ఎదురుగా ఉన్న గార్డెన్‌లో కొత్త భవనానికి శంకుస్థాపన ఘనంగా జరిగింది. స్వయంగా కేసీఆర్‌ గడ్డపారతో తవ్వి, ఆ తరువాత సిమెంట్‌ వేసి నూతన భవానానికి పునాదిరాయి వేశారు.

సచివాలయం భూమి పూజ అనంతరం ఎర్రమంజిల్‌లో నూతన అసెంబ్లీ భవనానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. సచివాలయం, అసెంబ్లీ భవనాల శంకుస్థాపన కార్యక్రమం ఓ పండుగలా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నూతన సచివాలయాన్ని సుమారు 400 కోట్ల రూపాయలతో నిర్మించనున్నారు. దాదాపు ఆరు లక్షల చదరపు అడుగుల్లో నిర్మించే కొత్త సచివాలయంలో మంత్రులు, సంబంధిత శాఖల కార్యదర్శులు, సెక్షన్లు అన్నీ ఒకేచోట వచ్చేలా ఏర్పాట్లు చేయనున్నారు. అటు అసెంబ్లీ నిర్మాణానికి దాదాపు 100 కోట్లు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం.

Tags

Read MoreRead Less
Next Story