మీసాల కృష్ణుడు ఆశీర్వాదం.. ఒక్కటైన కృష్ణ, విజయనిర్మల..

మీసాల కృష్ణుడు ఆశీర్వాదం.. ఒక్కటైన కృష్ణ, విజయనిర్మల..

సినిమా పరిశ్రమ పురుషాధిక్య ప్రపంచం. ఇక దర్శక రంగంలో అయితే వారిదే హవా.. వారి హవాకు తొలి నాళ్ల నుంచి కొందరు హీరోయిన్లు అడ్డుకట్ట వేయాలని చూసినా పెద్దగా సాధ్యం కాలేదు. కానీ తను మాత్రం దర్శకురాలిగా అనుకున్నది చేసి చూపించింది.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోనూ చోటు సంపాదించింది. ఈ పాటికే ఆమె డైనమిక్ లేడీ విజయనిర్మల అని అర్థమై ఉంటుంది కదూ.. లేటెస్ట్ గా ఆమె కీర్తి కిరీటంలో దాసరి స్వర్ణకంకణం చేరిన సందర్భంగా ఫేవరెట్ ఫైవ్ లో విజయనిర్మల సినీ విశేషాలు చూద్దాం..

విజయనిర్మల .. ఈ పేరు వినగానే చెరగని చిరునవ్వుతో నిండైన రూపం గుర్తొస్తుంది. హీరో కృష్ణ అర్థాంగి అయినా ఆయన విజయంలో సంపూర్ణ భాగస్వామ్యం ఉన్న భాగస్వామి గుర్తొస్తుంది. భానుమతి తర్వాత అంత డేరింగ్ హీరోయిన్ అంటే విజయ నిర్మలే అంటారు కొందరు. అది నిజమే అంటాయి ఆమె చేసిన సినిమాలు.. చూపిన ప్రతిభా పాటవాలు.. బాలనటిగా ప్రవేశించి హీరోయిన్ గా మారి, దర్శకురాలిగా, నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞ చూపిన ఆమెకు దాసరి స్వర్ణకంకణమే కాదు.. మరెన్నో అవార్డులు వచ్చే ఉండాలి..

డైరెక్టర్ అనే పదంలోనే పురుషుడు అనే అర్ధం సహజంగా ధ్వనిస్తుంది. సినిమారంగం...అందులోనూ దర్శకత్వ శాఖ అంటేనే పురుషులకి మాత్రమే అనేట్లు పేరు స్థిరపడిపోయింది. అలాంటి చోట దర్శకత్వం చేపట్టి..నిలదొక్కుకుని, 45 చిత్రాలకు దర్శకత్వం వహించి సక్సెస్ అయిన విజయ నిర్మల..అత్యధిక చిత్రాలకి దర్శకత్వం వహించి... గిన్నిస్ బుక్ కెక్కి తెలుగు సినిమాకు అంతర్జాతీయ సొగసులద్దిన మహిళగా చరిత్రలో నిలిచిపోతారు..

బాలనటిగా 'పాండురంగ మహత్యం' సినిమా తో వెండితెరపై అడుగు పెట్టిన విజయ నిర్మల తెలుగు, తమిళ సినిమాల్లో బాలనటిగా నటించారు. భార్గవనిలయం సినిమాతో మళయాలంలో, రంగుల రాట్నం సినిమాతో తెలుగులో హీరోయిన్ గా మారారు . అయితే మళయాలంలో హీరోయిన్ గా నటిస్తోన్న విజయ నిర్మలను చూసి దర్శకుడు బిఎన్ రెడ్డిగారు తెలుగులో రంగులరాట్నం సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు ..

రంగులరాట్నం తర్వాత ఎన్టీఆర్ తో నిండుదంపతులు, అక్కినేనితో బుద్ధిమంతుడు లాంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు. అయితే సూపర్ స్టార్ కృష్ణతో ఆమె తొలి చిత్రం సాక్షి. ఇదే తర్వాత వారి ప్రేమకు.. ఇన్నేళ్ల వారి వైవాహిక జీవితానికి సాక్ష్యంగా నిలిచింది.. అయితే ఈ విషయాన్ని ఆనాడే హాస్యనటుడు రాజబాబు ఊహించి చెప్పారట..

సాక్షి చిత్రం షూటింగ్ అవుట్ డోరులో ‘పులివెందుల’ గ్రామంలో షూటింగ్ జరుగుతుండగా అక్కడ ఉన్న ‘మీసాల కృష్ణుడు’ గుడిలో కృష్ణ, విజయ నిర్మల మెడలో తాళికట్టే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు దర్శకులు బాపు. అక్కడే ఉన్న హాస్యనటుడు రాజబాబు ఈ షాట్ చూసి విజయనిర్మలతో ‘‘మీసాల కృష్ణయ్య చాలా శక్తివంతమయిన దేవుడు. ఆయన సమక్షంలో ఏది అనుకున్నా అది జరిగి తీరుతుంది. మరి మీరు కూడా దంపతులవుతారేమో’’ అని జోక్ గా అన్నారు. ఆ జోక్ 1967మార్చి 24న తిరుపతిలో నిజమయ్యింది.

విజయ నిర్మల ప్రస్థానంలోని ప్రతి అడుగులో హీరోకృష్ణ ప్రోత్సాహం, ప్రోద్భలం ఉన్నాయి. అందుకే ఆమె అడుగూ విజయవంతమైంది. నిజానికి గ్లామర్ ఫీల్డ్ లో ఉన్న ఇద్దరూ దంపతులైతే మనస్పర్థలు వద్దన్నా వస్తాయి. కానీ వీరి విషయంలో అవి మచ్చుకైనా కనిపించకపోవడం విశేషం. ఆ అండర్ స్టాండింగ్ తోనే 1973లో విజయ నిర్మల ‘మీనా’ సినిమాతో దర్శకురాలిగా మారారు..

సహజంగా దర్శకులు.. నటులుగానూ ఉంటే రెంటికీ న్యాయం చేయడం ఇబ్బంది అవుతుందంటారు. కానీ మహిళ అయినా కూడా విజయ నిర్మలలో ఆ ఛాయలు కనిపించవు.. రెండు పాత్రల్లోనూ అత్యంత సమర్థవంతంగా ప్రతిభ చూపించగలిగింది..

అటు నటిగా, ఇటు దర్శకురాలిగా విజయ నిర్మల ప్రస్థానం అద్భుతంగా కొనసాగింది. దర్శకురాలిగా ఎంతో మంది దర్శకులు చేయలేని సాహసం కూడా చేసింది. అదే దేవదాసును రీమేక్ చేయడం. నాటి దేవదాసు ఎంత సంచలన విజయం సాధించిందో అందరికీ తెలుసు. అదే చిత్రాన్ని కృష్ణ హీరోగా రూపొందించి మరీ విజయం సాధించింది. అదే విజయనిర్మలలోని ప్రత్యేకత అంటారు.

దేవదాసు లాంటి సినిమాను కృష్ణ చేత చేయించాలనుకోవడమే ఆమె సాహసం.. కానీ ఆ సాహసాన్ని సక్సెస్ తో ముగించారు విజయ నిర్మల. అంతే కాదు.. తొలి దేవదాసులో ప్రేయసిగా నటించిన సావిత్రి.. ఈమెకు అత్యంత ఆప్తురాలు.. అందుకే ఈ చిత్రాన్ని ఆమెకు చూపించాలనుకున్నారట. కానీ అప్పటికే సావిత్రి జీవశ్చవమైందని ఎప్పుడు చెప్పినా బాధగానే చెబుతారు విజయనిర్మల..

ఓవైపు తెలుగుతో పాటు తను హీరోయిన్ గా పరిచయమైన మళయాలంలోనూ కొన్ని సినిమాల్లో నటిస్తూ మళయాలం, తమిళంలోనూ కొన్ని సినిమాలు డైరెక్ట్ చేశారు. అయితే తెలుగులో వచ్చిన గుర్తింపు దర్శకురాలిగా అక్కడ రాలేదు.. అదీకాక కృష్ణతోనే ఎక్కువ సినిమాలు చేయడం, ఆయన మార్కెట్ ఇదే కావడం కూడా ఓ కారణం అనుకోవచ్చు..

హీరో కృష్ణ సమర్పకునిగా శ్రీ విజయకృష్ణా మూవీస్ పతాకంపై చాలా చిత్రాలు నిర్మించారు. సొంత చిత్రాలే కాక, బయట చిత్రాలకూ దర్శకత్వం వహించారు. ఆమె దర్శకత్వం వహించిన ‘మీనా’, ‘సంఘం చెక్కిన శిల్పాలు’, ‘కవిత’, ‘దేవుడే గెలిచాడు’, ‘అంతం కాదిది ఆరంభం’, ‘దేవదాసు’ లాంటి చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చాయి.

విజయ నిర్మల డైరెక్ట్ చేసిన సినిమాల్లో ఎక్కువగా స్త్రీలకు సంబంధించిన కథాంశాలే ఉన్నాయి. అయితే నిందలాంటి ఈ పదాన్ని తొలగించడానికే ఆమె కొన్ని కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్స్ కూడా చేసింది. వాటిలో ప్రధానంగా ‘హేమాహేమాలు’, ‘రామ్ రాబర్ట్ రహీమ్’, 'అంతం కాదిది ఆరంభం’, ‘డాక్టర్ సినీ యాక్టర్’.. ఉన్నాయి..

విజయ నిర్మల చేసిన 44 సినిమాల్లో 25 సినిమాల్లో కృష్ణ నటించాడు. వీటిలో అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి హేమాహేమీలు, రజినికాంత్, చంద్రమోహన్ లతో కలిసి రామ్ రాబర్ట్ రహీమ్ లాంటి మల్టీస్టారర్స్ ఉన్నాయి..

ఇక ఆ రెండు సినిమాలతో పాటు కృష్ణ డ్యూయల్ రోల్ చేసిన అంతం కాదిది ఆరంభం, డాక్టర్ సినీ యాక్టర్ లు కూడా కమర్షియల్ గా సూపర్ హిట్ అయి దర్శకురాలిగా విజయ నిర్మల సత్తాను బాక్సాఫీస్ వద్ద చాటాయి.

ప్రస్తుతం దర్శకత్వానికి చాలాకాలం క్రితమే ఫుల్ స్టాప్ పెట్టారు.. ఓ నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా విజయ నిర్మల ఎంతో మంది మహిళలకు ఆదర్శవంతమైన పాత్ర పోషించింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించిన ఆమెకు ప్రభుత్వం తరఫు నుంచి 2008లో రఘుపతి వెంకయ్య అవార్డ్ కూడా వచ్చింది. కానీ అంతటి ప్రతిభాశాలికి ఈ అవార్డ్స్ మాత్రమే రావడం ఆమె అభిమానులకు నిరాశ కలిగించేదే. అందుకే ఒకానొక సందర్భంలో దాసరి నారాయణ రావు కూడా అవార్డులు అర్హులకు రావడం లేదని వాపోయారు. ఏదేమైనా దాసరి పేరు మీదుగా నెలకొల్పిన స్వర్ణకంకణాన్ని అందుకోవడం విజయనిర్మల ప్రతిభకు దక్కిన మరో గౌరవం అనే భావించాలి..

Tags

Read MoreRead Less
Next Story