ఆ సినిమా ‘సాక్షి’గా కలిసిన కృష్ణ-విజయ నిర్మల

ఆ సినిమా ‘సాక్షి’గా కలిసిన కృష్ణ-విజయ నిర్మల

కళ్లు మాట్లాడతాయి.. చిరునవ్వు అభినయిస్తుంది.. మాటలకు, అభినయానికి నృత్యం తోడయితే... నటన పాత్రలకు జీవం పోస్తుంది.. ఇవన్నీ కలగలిసిన ఒకే ఒక్క రూపం విజయ నిర్మల.. పుట్టిన ప్రతి మనిషిలో ఏదో ఒక కళ ఉంటుంది.. ఏదో ఒక రంగంలో రాణించే వారు కొందరైతే.. ఎంచుకున్న పనికే వన్నె తెచ్చే వారు మరికొందరు.. ఇలాంటి వారిలో విజయ నిర్మల ముందు వరుసలో ఉంటారు. కళారంగంలో స్త్రీ శక్తిని, సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన స్టార్‌ విజయ నిర్మల.

బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలంలో అనేక చిత్రాల్లో కథానాయికగా నటించి స్టార్ హీరోయిన్ అయిన నాటి తరం కథానాయిక విజయ నిర్మల నటనతో పాటు 44 చలన చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్‌ బుక్‌ పుటల్లో చోటు సంపాదించుకున్నారు. గుంటూరు జిల్లా నర్సరావుపేటలోని పాతూరులో 1946 ఫిబ్రవరి 20న విజయ నిర్మల జన్మించారు. విజయనిర్మల బాల్యం అత్యధిక కాలం పాతూరులోనే గడిచింది. రాజాగారి కోటలోని విక్టోరియా హాల్లో చిన్నతనంలోనే నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాత తల్లిదండ్రులతో కలిసి మద్రాసు వెళ్లిన విజయ నిర్మల ఎనిమిదవ ఏట బాల నటిగా మత్స్యరేఖ అనే తమిళ చిత్రంతో తెరంగేట్రం చేశారు. వెండి తెరపై తనదైన శైలిలో దూసుకుపోయారు. ఓ వైపు భరతనాట్యం అభ్యసిస్తూనే సినిమాల్లోనూ నటించారు. బాలనటిగా తన 10వ ఏట పాండురంగ మాహాత్మ్యం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు.. కృష్ణుడి వేషంలో విజయ నిర్మల నటించిన తీరు ఎన్టీఆర్‌ను ఆకట్టుకుందని చెబుతారు. బాలకృష్ణుడి వేషధారణలో ఎన్టీఆరే ఆమెకు తిలకం దిద్ది మేకప్‌ వేశారు.

తర్వాత తన తండ్రి మిత్రుడు.. ఛాయా గ్రహకుడు విన్సెంట్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం భార్గవీ నిలయంతో అప్పటి ప్రముఖ హీరో ప్రేమ్‌నజీర్ సరసన తన 18వ ఏట హీరోయిన్‌గా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు విజయ నిర్మల.. ఆ సినిమా హిట్ కావడంతో బి.ఎన్.రెడ్డి నిర్మించిన రంగుల రాట్నంలో చంద్రమోహన్ సరసన హీరోయిన్ గా ఛాన్స్‌ దక్కించుకున్నారు. రంగుల రాట్నం సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే విజయా ప్రొడక్షన్స్ తీసిన ఎంగవీట్ పెన్ అనే తమిళ చిత్రానికి దర్శకత్వం వహించిన బి.నాగిరెడ్డి ఈమెనే హీరోయిన్ గా తీసుకున్నారు.. ఈ సినిమా తర్వాతే తన అసలు పేరుకు ముందు విజయ అనే పదాన్ని పెట్టుకుని విజయ నిర్మలగా స్థిరపడిపోయారు. రంగుల రాట్నం ఘన విజయం సాధించడంతోపాటు విజయ నిర్మలకు నటిగా నంది అవార్డును అందజేసింది.

1967లో సాక్షి సినిమాతో కృష్ణతో కలిసి తొలిసారి నటించారు విజయ నిర్మల. ఆ తర్వాత వీరిద్దరూ నిజజీవితంలోనూ ఒక్కటయ్యారు. తర్వాత స్వయంకృషి, స్వీయ ప్రతిభ చిత్రాలలో నటిస్తూనే దర్శకత్వం మెళుకువలు నేర్చుకున్నారు. సాక్షి షూటింగ్ సందర్భంగా బాపు డైరెక్షన్ లో ఆ కిటుకులను పట్టేసిన ఆమె వెంటనే మలయాళ చిత్రం కవితను స్వీయ దర్శకత్వంలో నిర్మించి విజయం సాధించారు. ఒక రకంగా తాను దర్శకురాలిగా మారడానికి సాక్షి సినిమానే ప్రేరణ ఇచ్చింది.. బాపూ గీస్తున్న బొమ్మలను చూసి, ఆ స్క్రిప్టును చూశాక తనూ డైరెక్టర్‌ కావాలనే కోరిక కలిగింది.. అనుకున్నదే తడవుగా తన మనసులో మాటను కృష్ణ ముందు చెప్పారు. అయితే, విజయ నిర్మల మాట విని కృష్ణ ఆశ్చర్యపోయారు. హీరోయిన్‌గా చాలా భవిష్యత్‌ ఉందని, ఇప్పటికిప్పుడు డైరెక్షన్‌లోకి దిగితే ఇబ్బందులు తప్పవని సున్నితంగా మందలించారు.. అయితే, హీరోయిన్‌గా సినిమాలు చేస్తూనే డైరెక్షన్‌పై అవగాహన పెంచుకోమని సలహా ఇచ్చారు. అప్పట్నుంచి ఏ సినిమాలో నటించినా దర్శకుడి శైలిని నిశితంగా గమనించే వారు.

కవిత సినిమా మలయాళంలో సూపర్‌ హిట్‌ కావడంతో.. తర్వాత తెలుగులో కృష్ణను హీరోగా పెట్టి, తానే హీరోయిన్‌గా నటించి మీనా అనే సినిమాను తీశారు. ఐదు లక్షల బడ్జెట్‌తో 35 రోజుల్లో సినిమా తీశారు. 1973 డిసెంబరు 28న విడుదలైన మీనా సినిమా ఘన విజయాన్ని సాధించింది.. 25 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.. దాంతో నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా తన విజయ పరంపర అప్రతిహతంగా కొనసాగించారు. మీనాతో మొదలై.. విజయ నిర్మల దర్శకత్వ ప్రతిభ 44 చిత్రాల వరకు తీసుకెళ్లింది. ఆమె తెరకెక్కించిన 44 సినిమాల్లో సగానికిపైగా కృష్ణ నటించారు. ఒక రకంగా మీనా సినిమానే విజయ నిర్మల గిన్నిస్‌ స్థాయికి ఎదగడానికి ప్రాతిపదికగా కృష్ణ ఇప్పటికీ చెబుతుంటారు.

ఇక సూపర్‌ స్టార్‌ కృష్ణతో కలిసి 50కిపైగా చిత్రాల్లో నటించారు విజయ నిర్మల. సాక్షి నుంచి మొదలైన వీరిద్దరి ప్రస్థానం శ్రీశ్రీ వరకు సాగింది.. మోసగాళ్లకు మోసగాడు, మంచి కుటుంబం, అల్లూరి సీతారామరాజు, దేవుడు చేసిన మనుషులు, అక్కా చెల్లెళ్లు వంటి ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాల్లో కృష్ణకు జతగా నటించారు విజయ నిర్మల. కృష్ణ జీవిత భాగస్వామి అయిన తర్వాత ఆయన స్టార్‌ హీరోగా ఎదగడానికి విజయ నిర్మల కూడా ఒక కారణమయ్యారు. వీటిలో మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, పాడిపంటలు వంటి సినిమాలు రజతోత్సవాలు జరుపుకున్నాయి.. అల్లూరి సీతారామరాజు సినిమాలో విజయ నిర్మల నటన అత్యద్భుతం.

ఓన్‌గా డైరెక్షన్ నేర్చుకొన్న భానుమతి, సావిత్రి దర్శకత్వం వహించి చక్కని చిత్రాలు తీసినా వారిద్దరూ వారివారి సొంత నిర్మాణ సంస్థల చిత్రాలకే తప్ప బయట సంస్థలకు చేయలేదు. అయితే, అందుకు భిన్నంగా సినిమాలు చేసి కమర్షియల్ దర్శకురాలిగా విజయ నిర్మల గుర్తింపు పొందారు. 350కిపైగా సినిమాల్లో నటించిన కృష్ణ.. తెలుగు సినిమా చరిత్రలోనే ఈ ఘనత సాధించిన ఏకైక కథానాయకుడిగా చరిత్ర సృష్టిస్తే.. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా విజయ నిర్మల అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. అలాగని, డైరెక్షన్‌ అంటే ఏదో చిన్నా చితకా హీరోలకు కాదు... అక్కినేని, శివాజీ గణేశన్, రజనీకాంత్ వంటి అగ్ర కథనాయకుల సినిమాలను డైరెక్ట్ చేసే అవకాశం పొందిన మహిళా దర్శకుల్లో విజయనిర్మల పేరే ఇప్పటికీ వినబడుతోంది.. గిన్నిస్‌ బుక్‌ రికార్డుతోపాటు రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని కూడా విజయ నిర్మల అందుకున్నారు.

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 254 చిత్రాల్లో నటించారు విజయ నిర్మల. విజయ కృష్ణా పతాకంపై 25చిత్రాలు నిర్మించి దర్శకత్వం చేశారు. ఇంతటి ఘనత సాధించిన మహిళ సినీ పరిశ్రమలో మరొకరు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే విజయ నిర్మల ప్రస్థానం ఓ చరిత్ర.. భావితరం మహిళా దర్శకులకు ఓ ఇన్స్పిరేషన్‌.

Tags

Read MoreRead Less
Next Story