ఆంధ్రప్రదేశ్

ఒక్కొక్క టీడీపీ నేత సైకిల్ దిగి కమలం గూటికి

ఒక్కొక్క టీడీపీ నేత సైకిల్ దిగి కమలం గూటికి
X

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ మనుగడ కష్టమనిభావించారో ఏంటో తెలియదు గానీ ఒక్కొక్క టీడీపీ నేత సైకిల్ దిగి కమలం గూటికి చేరిపోతున్నారు. పార్టీలో సీనియర్లుగా కొనసాగుతున్న నేతలు సైతం పార్టీ మారుతున్నారు. తాజాగా టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ బీజేపీలో చేరిపోయారు. ఆయనకు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఆయన ఉన్నట్టుండి పార్టీ మారడంతో టీడీపీ వాయిస్‌ను బలంగా వినిపించే వక్త లేకుండా పోయినట్టయిందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇక.. మోదీ ఆధ్వర్యంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని.. ఏపీలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు లంకా దినకర్‌.

వరుసగా నేతలు బీజేపీలోకి మారడం టీడీపీని కలవరపెడుతోంది. రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ కూడా బీజేపీ నేతల్ని కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. అయితే.. తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజంలేదని అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. వ్యక్తిగత పనుల కోసం.. చంద్రబాబుకు చెప్పే ఢిల్లీ వెళ్లానని పేర్కొన్నారు. అమిత్‌షాను కలవలేదని, కలవాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం సరికాదని సూచించారు. తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని, తాను వ్యాపారవేత్తను కాదని సత్యప్రసాద్‌ చెప్పారు.

ఇప్పటికే టీడీపీ కాపు నేతలు పార్టీ మారుతున్నారన్న వార్తలు పుకార్లు రేపాయి. అయితే.. ప్రచారంలో నిజం లేదని వెల్లడించారు కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు. బీజేపీలోగానీ, వైసీపీలోగా చేరే ఆలోచనలే లేవని తేల్చి చెప్పారు. అటు.. నేతలు పార్టీ మారకుండా చంద్రబాబు ఎలాంటి నష్ట నివారణ చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.

Next Story

RELATED STORIES