టీడీపీ నేతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న ఆ ఘటనలు
ఎన్నికల ఫలితాల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దాడులు ఆ పార్టీ నేతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.. మరికొన్ని చోట్ల ప్రత్యర్ధులు హత్యలకు ఒడిగడుతున్నారు. మొన్న చీరాల నియోజకవర్గంలో, నిన్న మంగళగిరిలో టీడీపీ కార్యకర్తలపై దాడులు, హత్యలతో కలకలం రేగింది. వరుస ఘటనలపై టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవంటూ గళమెత్తుతోంది.
టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ముఖ్య నేతలతో సమావేశమైన ఆయన ఈ అంశంపై ప్రధానంగా చర్చించారు. వైసీపీ పాలనలో రాజకీయ హత్యలు జరుగుతున్నాయని, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్న విషయం సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. రాజకీయ హత్యలు జరుగుతుంటే ప్రభుత్వం నియంత్రించకపోవడాన్ని నేతలు తప్పుపట్టారు. ప్రభుత్వం స్పందించి ఇలాంటివి రిపీట్ కాకుండా చూడాలని కోరారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని.. ఏనాడూ హత్యా రాజకీయాలను టీడీపీ ప్రోత్సహించలేదని పేర్కొన్నారు. 2014లో టీడీపీ గెలిచినప్పుడు రాష్ట్రంలో ఎక్కడా గొడవలు జరగలేదని గుర్తు చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అయితే, ఎవరూ మనో ధైర్యం కోల్పోవద్దని చంద్రబాబు నేతలకు సూచించారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిద్దామని, ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని చంద్రబాబు సూచించారు.
మంగళగిరి ఇంద్రానగర్ నాలుగో వార్డులో హత్యకు గురైన టీడీపీ నేత తాడిబోయిన ఉమా యాదవ్ మృతదేహానికి మాజీ మంత్రి లోకేష్ నివాళులర్పించారు.. ఉమాయాదవ్ కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఆరుగురు టీడీపీ కార్యకర్తలను చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా రాష్ట్రంలో టీడీపీ నేతలే టార్గెట్‌గా జరుగుతున్న దాడులను ఆ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత సీఎంపై ఉందని గుర్తు చేస్తోంది.. రాజకీయ హత్యలపై డీజీపీని కలిసి ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com