భారత్ - అమెరికా దేశాల మధ్య సంబంధాల బలోపేతంపై చర్చ

భారత్ - అమెరికా దేశాల మధ్య సంబంధాల బలోపేతంపై చర్చ

అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో భారత్‌లో పర్యటిస్తున్నారు. ప్రధాని మోదీతో భేటీ అయిన పాంపియో.. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతంపై చర్చించారు. హెచ్‌ 1బీ వీసాలు, అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, రష్యా నుంచి ఎస్‌ 400 క్షిపణి కొనుగోలు సహా పలు అంశాలపై మోదీ, పాంపియో మధ్య చర్చ జరిగాయి. ఈనెల 28, 29 తేదీల్లో జపాన్‌లో జీ 20 సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, భారత ప్రధాని మోదీ భేటీకానున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రధాని మోదీతో భేటీ తర్వాత.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌, విదేశాంగమంత్రి జైశంకర్‌తో పాంపియో సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా రష్యా నుంచి ఎస్‌ 400 క్షిపణి వ్యవస్థల కొనుగోలు విషయంలో ఆంక్షల గురించి ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. 40 వేల కోట్ల విలువైన ఎస్‌ 400 శ్రేణి క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు.. భారత్‌ గత అక్టోబరులో రష్యాతో ఒప్పందం చేసుకుంది. అయితే ఈ ఒప్పందానికి అమెరికా అభ్యంతరం చెబుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఆంక్షల తొలగించేలా అమెరికాను ఒప్పించేందుకు జైశంకర్‌ సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.

మనకు చాలా దేశాలతో సంబంధాలు ఉన్నాయని.. దేశ ప్రయోజనాలకు ఏది మంచిదైతే అదే చేస్తామని పాంపియో ముందు భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ స్పష్టం చేశారు. అమెరికా ఆంక్షలకు గురైన రష్యా విషయంలోనూ ఇదే వర్తిస్తుందని స్పష్టం చేశారు. అలాగే, ఉగ్రవాదం కట్టడిపై ట్రంప్‌ యంత్రాంగం అవలంబిస్తున్న విధానంపై సంతోషాన్ని జైశంక్‌ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అమెరికాకు భారతదేశం చాలా ముఖ్యమైన భాగస్వామి అని పాంపియో చెప్పుకొచ్చారు.. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సమున్నత స్థాయికి చేరుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.. మరోవైపు పాంపియోతో జరిపిన చర్చల్లో ఇంధనం, వాణిజ్యంతోపాటు ఆఫ్గనిస్ఆన్‌, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో పరిస్థితులు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story