వేరుశనగ విత్తనాల కొరత.. ఎమ్మెల్యేని నిలదీసిన రైతులు..
అనంతపురం జిల్లాలో ఎక్కువ మంది రైతులు వాణిజ్య పంట వేరుశనగపై ఆధారపడుతుంటారు. జిల్లాలో నెలకొన్న వర్షాబావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు వర్షాదారపంటైన వేరుశనగ జీవనాధారం. ఏడున్నర లక్షల హెక్టార్లలతో వేరుశనగ సాగుచేస్తుంటారు ఇక్కడి రైతులు. ఈ పంటపై అధికారులు ముందుచూపు లేకపోవడంతో రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుంతకల్ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిని మార్కెట్ యార్డులో రైతులంతా కలసి నిలదీసిన పరిస్థితి తలెత్తింది...
ఖరీఫ్‌లో రైతులు వేరుశనగ పంటను సాగుచేస్తారని తెలిసినా అధికారులు ఆ దిశగా విత్తనాలు సేకరించడంలో చొరవ చూపలేదు. మార్క్ ఫెడ్, ఆయిల్ ఫెడ్, ఏపీ సీడ్స్ ఏజెన్సీల వద్ద నుంచి మూడున్నర లక్షల టన్నుల వేరుశనగ విత్తనాలు సేకరించి సిద్దంగా ఉంచాలి. ఖరీఫ్ మొదలవ్వగానే రైతులకు ఇవ్వాలి. అయితే... అధికారుల నిర్లక్ష్యం వల్ల... రెండు వారాలుగా పంపిణీ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. అరకొర పంచి చేతులు దులుపుకుంటున్న అధికారులపై రైతులు తిరగబడుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా 64 మండలాలుండగా మూడున్నర లక్షల సబ్సిడి వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయాలి. ఇంత వరకు 31 మండలాల్లో 8వేల మంది రైతులకు 9 వేల క్వింటాళ్లే పంపిణీ చేశారు. విత్తన కొరత మూలంగా 32 మండలాల్లో విత్తన పంపిణి వాయిదా వేశారు. పలు మండలాల్లో 17 వేల క్వింటాళ్ల విత్తన కాయలు నిల్వ ఉన్నాయి. విత్తన నిల్వలు తగ్గినా విత్తన కాయలు వచ్చిన తరువాతే పంపిణీ చేపట్టాలని అగ్రికల్చర్ అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు..
మరోపక్క పలుకుబడి ఉన్నవారు.... పేదరైతుల పాస్ పుస్తకాలు సేకరించి రాత్రికి రాత్రి సబ్సిడి విత్తనాలను కర్ణాటకకు తరలిస్తున్నారు. కళ్యాణదుర్గం, శింగనమల, గోరంట్ల మండలాల్లో భారీగా అక్రమంగా గోడౌన్లో నిలువ చేసిన సబ్సీడి విత్తనాలను అధికారులు సీజ్ చేశారు..
నిజానికి అనంతపురం జిల్లాలోని ఏడున్నర లక్షల హెక్టార్లలో 12 లక్షల క్వింటాళ్ల విత్తన వేరుశనగ అవసరం. కానీ కేవలం 3 లక్షల క్వింటాళ్లే సరఫరా చేస్తోంది. ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వేరుశనగ విత్తనాలను పంపిణీ చేయాలని కోరుతున్నారు రైతులు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com