సీఎం జగన్ మరో కీలక నిర్ణయం.. ఏ క్షణమైనా వారికి షోకాజ్ నోటీసులు
కృష్ణానది కరకట్టలపై అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది ఏపీ ప్రభుత్వం. చట్టాలను ఉల్లంఘించి నిర్మించిన కట్టడాలన్నింటికి నోటీసులు సిద్ధం చేసింది. ఏ క్షణమైనా.... అక్రమ నిర్మాణదారులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంది. విపక్షనేత చంద్రబాబు ఉంటున్న నివాసం సైతం.. అక్రమంగా నిర్మించినట్లు నిర్ధారణకు వచ్చారు సీఆర్‌డీఏ అధికారులు. దీంతో విపక్షనేత చంద్రబాబు సహా ఆ భవన యజమాని లింగమనేని రమేష్‌కు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
కరకట్టపై నిర్మించిన అన్ని భవనాల యజమానులకు నోటీసులు ఇవ్వనున్నారు అధికారులు. వారం రోజుల్లోగా.. ఈ నిర్మాణాలను తొలగించాలని, రూల్స్‌కు విరుద్ధంగా ఎందుకు నిర్మించారో వివరణ ఇవ్వాలని కూడా సీఆర్‌డీఏ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో స్పందించకపోతే...ఈ భవనాలను తొలగిస్తామని నోటీసుల్లో స్పష్టం చేసినట్లు సమాచారం. ఒకవేళ సంజాయిషీ ఇచ్చినా అది సంతృప్తికరంగా లేకపోయినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తేల్చి చెబుతున్నట్లు తెలుస్తోంది. కృష్ణానది కరకట్టపై వంద మీటర్లలోపు 50కి పైగా భవనాలు అక్రమంగా నిర్మించారు. వీటిన్నింటికి నోటీసులు ఇవ్వనున్నారు సీఆర్డీఏ అధికారులు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com