మీరు నీతి, నిజాయితీ గురించి మాట్లాడుతుండడం బాగోలేదు సార్ : నారా లోకేష్

మీరు నీతి, నిజాయితీ గురించి మాట్లాడుతుండడం బాగోలేదు సార్ : నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. చంద్రబాబు హయాంలో జరిగిన కార్యకలాపాలపై సీఎం జగన్ విచారణకు ఆదేశించడం వివాదాస్పదమవుతోంది. జగన్‌ చర్యల్ని నిరసిస్తూ.... టీడీపీ నేత నారా లోకేష్ స్పందించారు. అక్రమాస్తుల కేసుల్లో మీపై లెక్కకు మించి ఛార్జిషీట్లున్నాయని విమర్శించారు. నిందితుడుగా కొన్నాళ్లు జైల్లో ఉన్నారని గుర్తుచేశారు. అలాంటి మీరు నీతి, నిజాయితీ అని మాట్లాడుతుండడం బాగోలేదు సార్ అంటూ ఎద్దేవా చేశారు నారా లోకేష్..

గతంలోనూ చంద్రబాబు పాలనపై విచారణ జరిపించిన విషయాన్ని గుర్తు చేశారు లోకేష్. మీ బాబు, మా బాబుపై 26 కమిటీలు వేశారంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశారాయన. అవినీతి ముద్ర వేయాలని అడ్డదార్లు తొక్కారని విమర్శించారు. చివరకు వైఎస్సార్ తరం కాలేదని.. ఇప్పుడు మీ తరమూ కాదంటూ జగన్‌కు ట్వీట్‌ చేశారు లోకేష్. వంశధారలో ఎలాంటి అవినీతి జరగలేదని జగన్‌ వేసిన కమిటీ గతంలో నిర్ధారణ చేసిందని నారా లోకేష్‌ అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు హయాంలో పంపిన అంచనాలన్నింటికి కేంద్రం ఓకే చెప్పిందని గుర్తుచేశారు. అందరూ మీలా అవినీతిపరులే అని ముద్ర వేయాలని కంటున్న కల.. కలగానే మిగిలిపోతుందని లోకేష్‌ స్పష్టంచేశారు..

అటు.. సోమవారం గుంటూరు పార్టీ కార్యాల‌యానికి వెళ్ళ‌నున్నారు చంద్ర‌బాబు. రోజు అక్క‌డి నుండే స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తారు. ఇప్పుడు ఉంటున్న ఉండ‌వ‌ల్లి నివాసం చిన్న‌దిగా ఉండ‌టం, స‌రైన పార్టీ ఆఫీస్ స‌మీపంలో లేక‌పోవ‌డంతో సోమ‌వారం నుండి గుంటూరు పార్టీ ఆఫీస్ కు వెళ్ళాల‌ని నిర్ణ‌యించారు. కొత్త‌గా మంగ‌ళ‌గిరిలో నిర్మిస్తున్న పార్టీ ఆపీస్ పూర్తయ్యేందుకు కొంత స‌మ‌యం ప‌ట్ట‌నుంది. క‌ర‌క‌ట్ట ప్రాంతంలోనే కొన్ని భ‌వ‌నాల‌ను ప‌రిశీలించినా అవ‌న్ని అంత సౌక‌ర్య‌వంతంగా లేవు. దీంతో గుంటూర్ ఆఫీస్‌లోనే రివ్యూలు చేస్తారు.

Tags

Next Story