టీడీపీపై నిందలు వేయాలనే అజెండాతోనే సీఎం జగన్‌ సమీక్షలు : టీడీపీ నేతలు

ప్రస్తుత రాజకీయ పరిణామాలు, జగన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై చంద్రబాబు నివాసంలో చర్చలు జరిపారు టీడీపీ నేతలు. ముఖ్య నేతలంతా హాజరైన ఈ సమావేశంలో.. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. టీడీపీపై నిందలు వేయాలనే అజెండాతోనే సీఎం జగన్‌ సమీక్షలు చేస్తున్నారన్నారు టీడీపీ నేతలు. గతంలో వైఎస్‌ హయాంలో ఎన్నో సబ్‌ కమిటీలు వేశారని.. ఇప్పుడు అదే తరహాలో జగన్‌ సబ్‌ కమిటీలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇది కక్షపూరితమైన అనాలోచిత చర్య తప్ప మరొకటి కాదన్నారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే విద్యుత్‌ కొనుగోళ్లు జరిగాయన్నారు..

మరోవైపు.. పార్టీలో అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు చంద్రబాబు. సమీక్షా సమావేశానికి హాజరు కాని నేతల్ని ఆరా తీశారు. వాళ్లు ఎందుకు రాలేదని పార్టీ ముఖ్యనేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. బాబూ రివ్యూకు... కాపునేతలు బొండా ఉమా, జ్యోతుల నెహ్రూ, తోట త్రిమూర్తులు డుమ్మాకొట్టారు. వీరితో మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ, చినరాజప్పలు చర్చలు జరిపారు. వీరు ఇవాళ చంద్రబాబుతోనూ సమావేశం కానున్నారు. మొత్తానికి ఆప‌రేష‌న్ క‌మ‌లం చూపు పార్టీ పై ప‌డ‌కుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు చంద్ర‌బాబు. మ‌రి నేత‌లు బాబు మాట‌ల్ని వింటారా లేదా అన్నది చూడాలి.

Tags

Next Story