తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లని కబురు

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఉత్తర బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది..ఇది తదుపరి 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని వెల్లడించారు. ఇందుకు అనుకూలమైన వాతావరణం స్థానికంగా ఏర్పడిందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాన్ని ఆనుకుని ఉపరితల ఆవర్తనం కూడా నెలకొంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు చేరువగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు..

దేశంలోని అన్ని ఇతర ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అటు తెలంగాణలో పలు చోట్ల వాతావరణం చల్లబడింది. తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఇన్నాళ్లు ఎండలకు అల్లాడిన ప్రజలంతా వానలతో సేదతీరుతున్నారు. వాతావరణం మార్పు కారణంగా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు... వాయు గుండం ప్రభావంతో జూలై 2న తెలంగాణలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అటు వర్షాకాలం నేపథ్యంలో హైదరాబాద్‌ నగరంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడంపై అధికారులు దృష్టి సారించారు. జీహెచ్‌ఎంసీ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఉమ్మడి నిజమాబాద్ జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. జిల్లాలో ఇప్పటి వరకు 11 సెంటీమీటర్లు కురిసింది. లోటు వర్షపాతం ఉన్నప్పటికీ ఇటీవల కురుస్తున్న వానలు అన్నదాతకు కాస్త ఊరట ఇస్తున్నాయి. ఆరుతడి పంటల సాగు ఊపందుకుంది.

Tags

Next Story