ముంబయి మహా నగరాన్ని వణికిస్తున్న వరుణుడు

ముంబయి మహా నగరాన్ని వరుణుడు వణికిస్తున్నాడు. భారీ వర్షాలకు నగరం అతలాకుతలం అవుతోంది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఏకబిగిన భారీ వర్షం కురుస్తూనే ఉంది. నగరంతో పాటుగా మహారాష్ట్రలోని అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తునే ఉన్నాయి. భారీ వర్షాలు కారణంగా నగరంలో విద్యుత్ ఘాతానికి గురై నలుగురు చనిపోగా, ఐదుగురికి గాయాలు అయ్యాయి. చాలా చోట్ల వర్షం నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ముఖ్యంగా శాంతాక్రుజ్‌లో 9 గంటల వ్యవధిలో 140 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఇక విరార్, జుహు, ములుంద్ ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులన్నీ జలదిగ్బంధం అయ్యాయి. మామూలుగానే ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందిపడే ముంబయి వాసులు భారీ వర్షంతో నరకం చూశారు. భారీ వర్షాలకు అనేక రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
ముంబయి శివారు ప్రాంతాల్లోనూ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పలు చోట్ల ట్రాఫిక్ మళ్లించారు. గడిచిన ఐదుగంటల్లో నగరంలో 43.23 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ముంబయి తూర్పు ప్రాంతంలో 78.21 మిల్లీ మీటర్ల భారీ వర్షపాతం నమోదైంది.
నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో వరద పోటెత్తిన నేపథ్యంలో ప్రజలు మ్యాన్‌హోల్స్ తెరవరాదని బృహన్ ముంబై అధికారులు కోరారు. అటు థానే, పాల్ఘర్, రత్నగిరి ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇవాళ కూడా కుండపోత వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com