చదువుల 'మణి'హారం.. అమెజాన్‌లో ఏడాదికి 'కోటి' వేతనం

నీ కోసం నువ్వు చదువుకోవాలి.. నీ కాళ్ల మీద నువ్వు బ్రతకాలి.. నలుగురికీ ఆదర్శంగా నిలవాలి అని అమ్మా నాన్న చెప్పిన మాటలు అక్షరాలా ఆచరించాడు విశాఖ మారుమూల ప్రాంతానికి చెందిన మణికుమార్. చింతలగ్రహారం గ్రామానికి చెందిన ఆడారి రాము, మీనాక్షి దంపతుల ముగ్గురు పిల్లలో ఒకడు మణికుమార్. గ్రామంలోని హైస్కూల్లో పదవతరగతి వరకు చదివాడు. నూజివీడు ట్రిపుల్ ఐటీ మొదటి బ్యాచ్ విద్యార్థిగా చదువులో తన ప్రతిభ కనబరిచాడు. చదువుకుంటూనే అల్గారిథమ్ సమస్యలకు పరిష్కారాలు కనుగొనే నైపుణ్యాన్ని సంపాదించాడు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పట్టు సాధించాడు. బీటెక్ మూడో సంవత్సరం చదువుతుంటేనే అమెజాన్ మిషన్ లెర్నింగ్‌లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదే ఉద్యోగం చేయాలనుకున్న మణి కుమార్ క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో మంచి ఉద్యోగం వచ్చినా వెళ్లలేదు. బీటెక్ పూర్తయిన తరువాత ఓ స్టార్టప్ కంపెనీలో ఏడాది రూ.8 లక్షల వేతనానికి జాయినయ్యాడు. దాన్ని కొద్దికాలానికే స్నాప్‌డీల్ సంస్థ కొనుగోలు చేసింది. అందులో పని చేస్తుండగానే అమెజాన్‌లో అవకాశం వచ్చింది.
2015లోనే ఏడాదికి రూ.18 లక్షల వేతనం అందుకున్నాడు. తర్వాత ప్రమోషన్ వచ్చి అమెజాన్ అమెరికా కంపెనీలో పని చేసే అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. ప్రమోషన్‌తో పాటు వేతనం రూ.40 లక్షలకు పెరిగింది. రెండేళ్ల అనుభవంతో ప్రస్తుతం ఏడాదికి కోటి రూపాయల వేతనం అందుకుంటున్నారు మణికుమార్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com