శ్రీలంక ఆశలపై నీళ్లు చల్లిన సౌతాఫ్రికా

చెస్టర్ లీ స్ట్రీట్‌లో సీన్ రివర్స్ అయింది.. ఇంగ్లండ్‌కు షాకిచ్చి అదే సీన్‌ను రిపీట్ చేసి సెమీ ఫైనల్స్‌కు చేరాలనుకున్న శ్రీలంక ఇంటి దారి పట్టింది.. శ్రీలంక ఆశలపై సౌతాఫ్రికా నీళ్లు చల్లింది. ఇప్పటి వరకు ఏ మ్యాచ్‌లోనూ పెద్దగా దూకుడు ప్రదర్శించని సఫారీలు పనిగట్టుకుని మరీ శ్రీలంక మీద మూకుమ్మడి దాడి చేశారు.. సెమీస్ రేసులో నిలిచేందుకు కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో సాధారణ స్కోరుకే పరిమితమైన శ్రీలంక.. అటు బౌలింగ్‌లోనూ ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయింది.. దీంతో టోర్నీలో మూడో ఓటమిని మూటగట్టుకుని నాకౌట్ అవకాశాలను దూరం చేసుకుంది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌట్ అయింది.. తొలి బంతికే శ్రీలంకకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. రబాడ వేసిన మొదటి బాల్‌కే ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్, కెప్టెన్ కరుణరత్నే గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. కుషాల్ పెరెరా, అవిష్క ఫెర్నాండో మినహా మిగిలినవారు చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. 204 పరుగుల లక్ష్య ఛేదినతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా టార్గెట్‌ను ఆడుతూ పాడుతూ కొట్టేసింది.
మలింగ మ్యాజిక్ సఫారీలపై పెద్దగా పనిచేయలేదు.. డికాక్‌ను తన యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేయగలిగినా ఆ తర్వాత వికెట్లను తీయలేకపోయాడు.. డికాక్ ఔటయ్యాక ఆమ్లాతో కలిసి కెప్టెన్ డుప్లెసిస్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఫామ్‌లో లేని ఆమ్లా కూడా శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. 68 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వికెట్ల ముందు దొరికిపోయిన ఆమ్లా రివ్యూ కోరి బతికిపోయాడు. తర్వాత ఈ ఇద్దరూ కలిసి జట్టును విజయం వైపు నడిపించారు. రెండో వికెట్‌కు 175 పరుగులు జోడించి మరో 76 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించారు.
ఇప్పటికే ఏడు మ్యాచ్‌లు ఆడిన శ్రీలంక రెండు మ్యాచుల్లో మాత్రమే నెగ్గింది.. మరో రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కావడంతో రెండు పాయింట్లు తన ఖాతాలో చేరాయి.. ఇక మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా 10 పాయింట్లకు మాత్రమే శ్రీలంక పరిమితమవుతుంది.. దీంతో అధికారికంగా రేసులో ఉన్నా నాకౌట్ చేరడం అసాధ్యంగానే కనబడుతోంది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com