అక్కడ కొలువైన శివ లింగాన్ని దర్శించుకోవాలంటే అంత సులువు కాదు!

హిమాలయాల్లో కొలువై ఉన్న మహా శివున్ని దర్శించుకునే అమర్‌నాథ్ యాత్ర.. జులై 1 నుంచి ప్రారంభం కానుంది. ఆ మహాశువుని మంచు లింగాన్ని దర్శించుకునే మహా భాగ్యం కోసం వేయి కళ్లతో భక్తులు ఎదురు చూస్తున్నారు. జులై 1 నుంచి 40 రోజుల పాటు సాగే ఈ అమర్‌నాథ్ యాత్ర కోసం ఆదివారం తొలి బ్యాచ్ బయలు దేరనుంది. అమర్‌నాథ్ యాత్ర కోసం ఈసారి లక్ష 50 వేల మంది తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు.
సాధువులతో సహా వందలాది మంది భక్తులు ఇప్పుడిప్పుడే జమ్మూకు చేరుకుంటున్నారు. మంచు కొండల్లో కొలువైన శివ లింగాన్ని దర్శించుకోవాలంటే అంత సులువు కాదు. లోయలు, కొండలను దాటుకుంటూ ఆ మంచు లింగాన్ని చేరుకోవాలంటే చెమటోడ్చాల్సిందే. యాత్రలో ఎన్నో విపత్తులు, ఆటంకాలు ఎదురవుతాయి. వాటిని తట్టుకుని నిలబడగలిగే భక్తులే ఆ మంచు శివలింగాన్ని చేరుకుంటారు.
ఉగ్రదాడుల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు, ఆర్మీ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బల్తాల్, పహల్గామ్ మార్గాల్లో సీఎఆర్‌పీఎఫ్ బలగాలు మోహరించాయి. ఇప్పటికే అమర్‌నాథ్ యాత్రపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. యాత్ర సజావుగా జరిగేలా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గతేడాది ఎన్నో విపత్తులు తలెత్తాయి. యాత్రలో కొంత మంది ప్రాణాలు కోల్పోవడం విషాదంగా మారింది. వర్షాకాలం కావడంతో యాత్ర మార్గంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్తగా ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.
దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లోని 3 వేల 880 మీటర్ల ఎత్తులో గుహలో సహజసిద్ధంగా ఏర్పడిన మంచు లింగాన్ని గతేడాది 2 లక్షల 85 వేల మంది యాత్రికులు దర్శించుకోగా.. ఈ సారి అంతకంటే ఎక్కువ భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
Tags
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com