కీలక నిర్ణయాలు తీసుకున్న తెలుగు రాష్ట్రాల సీఎస్‌లు!

చిక్కుముడులన్నీ ఒక్కొక్కటిగా వీడుతున్నాయి.. విభజన సమస్యలకు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రగతి భవన్‌లో సమావేశం నిర్వహించిన ఇరు రాష్ట్రాల సీఎస్‌లు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీలోని తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగులను సొంత రాష్ట్రానికి కేటాయించే అంశంపై ఏకాభిప్రాయానికి వచ్చారు.. అలాగే నిధులు, ఆస్తుల పంపకాలకు సంబంధించిన వివాదాలను వెంటనే పరిష్కరించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు.

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యల పరిష్కారానికి రోడ్‌ మ్యాప్‌ సిద్ధమవుతోంది.. ఈ దిశగా రెండు ప్రభుత్వాలు కసరత్తు వేగవంతం చేస్తున్నాయి.. నదీ జలాల వినియోగంపై ఇప్పటికే ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమై చర్చిగా.. విభజన సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ, ఏపీకి చెందిన ఉన్నాతాధికారులు కసరత్తు మొదలు పెట్టారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ఇరు రాష్ట్రాల సీఎస్‌లతోపాటు సలహాదారులు సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌ సూచించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌ విభజనపైనా సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం.

ప్రధానంగా ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత నాలుగో తరగతి ఉద్యోగులను సొంత రాష్ట్రానికి కేటాయించే అంశంపై ఏకాభిప్రాయం వచ్చినట్లుగా తెలుస్తోంది. 9, 10 షెడ్యూల్‌ సంస్థల్లోని ఉద్యోగులు, ఆస్తులు అప్పుల పంపకాలపై ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో చర్చలు జరిగినట్లుగా సమాచారం. ఇరు రాష్ట్రాలకు సమన్యాయం జరిగే అవకాశం ఉన్న 89 సంస్థలకు సంబంధించిన సమస్యలపై అధికారులు దృష్టిపెట్టారు. అలాగే తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్‌ బకాయిల అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామని తెలంగాణ సీఎస్‌ చెప్పినట్లుగా సమాచారం.

నది జలాల వినియోగం, గోదావరి జలాలను కృష్ణాకు తరలింపుపై సమగ్ర నివేదికను జులై 15 లోగా ఇవ్వాలని ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో తాజా సమావేశంలో చర్చించిన అంశాలపై అధికారులు ప్రాధమిక నివేదికను సిద్ధం చేసుకుంటున్నారు. వారం రోజుల్లోగా ఇరు రాష్ట్రాల సీఎస్‌లు, సలహాదారులు మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. అటు అధికారులు నివేదిక ఇచ్చిన తర్వాత ఇరు రాష్ట్రాల సీఎంలు మరోసారి భేటీ అవుతారు. ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Tags

Next Story