కృష్ణ వ్యవహారశైలిపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం

కృష్ణ వ్యవహారశైలిపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం
X

సిర్పూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, కొమురం భీమ్‌ ఆసీఫాబాద్‌ జిల్లా జడ్పీ వైఎస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణ రెచ్చిపోయాడు. అధికారం ఉందన్న ధైర్యమో, మరేదో కానీ విధి నిర్వహణలో ఉన్న ఫారెస్ట్‌ అధికారులపై దౌర్జన్యానికి దిగాడు. అతని అనుచరులతో కలిసి కర్రలతో చితకబాదాడు. ఓ మహిళ ఉద్యోగిని అని చూడకుండా ఎఫ్‌ఆర్‌ఓ అనితపై ఇలా విచక్షణ రహితంగా దాడికి దిగాడు.

పోలీసులు ఆపుతున్నా ఆగకుండా అతని దౌర్జన్యకాండ కొనసాగింది. తన మనుషులతో ఎఫ్‌ఆర్‌ఓ అనితను ఇష్టం వచ్చినట్లు కొట్టాడు కోనేరు కృష్ణ. స్థానికులను ఉసిగొల్పి రణరంగం సృష్టించాడు. దీంతో సార్సాల గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ప్రాంతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్రత్యామ్నాయ అటవీకరణ పనులు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో కాగజ్‌నగర్‌ అటవీ ప్రాంతంలోని సార్సాలా గ్రామంలో 20 హెక్టార్లలో చెట్లు నాటేందుకు ఫారెస్ట్‌ అధికారులు సిద్ధమయ్యారు. చెట్లు నాటేందుకు వీలుగా భూమిని చదును చేసేందుకు ట్రాక్టర్లు, సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఇది గమనించి అక్కడుకు చేరకున్న కోనేరు కృష్ణ, అతని అనుచరులు ఒక్కసారిగా ఆటవీశాఖ సిబ్బందిపైకి దూసుకొచ్చారు. అటవీ భూములను స్వాధీనం చేసుకుంటున్నట్లు ఎఫ్ఆర్వో చెప్పటంతో మరింత రెచ్చిపోయారు. వెంట తెచ్చుకున్న కర్రలతో ట్రాక్టర్ పై బాదారు. ఫారేస్ట్ రేంజ్ ఆఫీసర్ అనిత వాళ్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుండగానే కోనేరు కృష్ణ మరింత రెచ్చిపోయాడు. కృష్ణ, అతని అనుచరుల దాడిలో అనిత తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తనపై అకారణంగా దాడికి పాల్పడ్డారని అనిత ఆవేదన వ్యక్తం చేశారు. పదిమంది ఒక్కసారిగా కర్రలతో తలపై కొట్టారని, ఆక్షణంలో తాను బతుకుతానని అనుకోలేదని కన్నీటిపర్యంతమయ్యారు.

ప్రభుత్వ విధుల్లో భాగంగా మొక్కలు నాటేందుకు వెళ్లిన ఓ మహిళా ఆఫీసర్ పై అధికార పార్టీకి చెందిన నేతలే దాడి చేయటం సర్వత్ర విమర్శలకు తావిస్తోంది. అటు IFS అధికారుల సంఘం దాడిని తీవ్రంగా ఖండించింది. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఎమ్మెల్యే సోదరుడు కృష్ణపై చర్యలు తీసుకునే వరకు విధులకు హాజరుకాబోమని తేల్చి చెప్పారు అటవీ శాఖ ఉద్యోగులు.

జెడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణ వ్యవహార శైలిపై సీఎం కేసీఆర్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించి చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగిపై దాడి చేయడం దారుణమన్నారు. ఇప్పటికే అతనిపై చర్యలు మొదలయ్యాయని.. చట్టానికి ఎవరూ అతీతులు కారంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఈఘటనకు సంబంధించి ఇప్పటి వరకు కృష్ణతో పాటు 16 మందిపై కేసులు నమోదు చేశారు. 30 మందిని అదుపులోకి తీసుకున్నారు.

జడ్పీ వైస్‌ చైర్మన్‌ పదవికి, జడ్పీటీసీ సభ్యత్వానికి కోనేరు కృష్ణ రాజీనామా చేశారు. రైతులపై అటవీ అధికారుల తీరును నిరసిస్తూ జిల్లా కలెక్టర్‌కు రాజీనామా లేఖను అందజేశారు. సిర్పూర్‌ నియోజకవర్గంలో ఫారెస్ట్‌ అధికారుల అగడాలు మితిమీరాయని..రైతులపై దౌర్జన్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

దాడిలో గాయపడిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనితను కోమ్రంభీం జిల్లా ఎస్పీ పరామర్శించారు. దాడి జరిగిన తీరుపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Tags

Next Story