తెలంగాణలో ఇంజినీరింగ్‌ వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియకు లైన్‌ క్లియర్‌

తెలంగాణలో ఇంజినీరింగ్‌ వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియకు లైన్‌ క్లియర్‌

తెలంగాణలో ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఫీజులపై నెలకొన్న సస్పెన్స్‌కు తాత్కాలికంగా తెరపడింది. ఫీజులు తాత్కాలికంగా పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఏఎఫ్‌ఆర్‌సీ చేసిన ప్రతిపాదనను కాలేజీలు అంగీకరించాయి.. ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీల యాజమాన్యాలతో రుసుముల నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఫీజులు 30 శాతం పెంచాలని కాలేజీ యాజమాన్యాలు డిమాండ్‌ చేశాయి.. లెక్చరర్స్‌, ప్రొఫెసర్స్‌ జీతాలతోపాటు ల్యాబ్‌ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఫీజులు పెంచాల్సిందేనని తేల్చి చెప్పాయి.

అయితే, ప్రస్తుతానికి 15 నుంచి 20 శాతం మేర ఫీజులు పెంచుకోవాలని ఏఎఫ్‌ఆర్‌సీ ప్రతిపాదించింది. 50వేల లోపున్న ఫీజులను 20 శాతం పెంచుకునేందుకు అంగీకారం తెలుపగా.. 50వేలకు మించివున్న ఫీజులను 15 శాతం పెంచుకునేలా ప్రతిపాదనలు ఉంచింది.. అయితే ఇవి తాత్కాలికమేనని.. నెలరోజుల్లో పూర్తిస్థాయి ఫీజులను ఖరారు చేస్తామని రుసుముల నియంత్రణ కమిటీ ఛైర్మన్‌ చెప్పారు. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు సహకరించాలని కాలేజీల యాజమాన్యాలను కోరారు. మధ్యంత పెంపు ప్రతిపాదనకు ఇంజినీరింగ్‌ కాలేజీల యాజమాన్యాలు ఓకే చెప్పడంతో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియకు లైన్‌ క్లియర్‌ అయింది.

అటు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఫీజుల పెంపుపై విద్యార్థి లోకం భగ్గుమంది.. ఫీజులు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన బాట పట్టాయి.. విశ్వేశ్వరయ్య భవన్‌లో విద్యార్థి సంఘాల నేతల ధర్నా చేపట్టారు. AFRC మీటింగ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా భవన్‌లోకి దూసుకెళ్లారు. సమావేశం జరుగుతున్న హాల్‌ ముందే ఆందోళనకు దిగారు. AFRC కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల ఆందోళనతో పరిస్థితి ఉద్రిక్తకు దారితీసింది. పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story