ఆ మార్పులకు కట్టుబడతామన్న 19 దేశాలు

ఆ మార్పులకు కట్టుబడతామన్న 19 దేశాలు

జపాన్‌ ఒసాకాలో 14వ G-20 సమ్మిట్‌తో ముగిసింది. రెండు రోజుల జపాన్ పర్యటనలో ప్రధాని మోదీ మొత్తం 9 ద్వైపాక్షిక సమావేశాలు, వివిధ దేశాలతో మూడు జాయింట్‌ మీటింగ్‌లను నిర్వహించారు. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన భేటీనే హైలైట్‌గా నిలిచింది. ప్రధాని మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిద్దరి మధ్య జరిగిన తొలి సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

G-20 సమ్మిట్‌లో భాగంగా కీలక సమావేశాల్లో ప్రధాని పాల్గొన్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, వియత్నాం ప్రధాని నుయెన్ జువాన్‌తో పాటు ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మల్పాస్, సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్, ఇటలీ అధ్యక్షుడు గిసప్పే కోంటే, చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినెరాతో ప్రధాని సమావేశం అయ్యారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక, వాణిజ్య బలోపేతంపై చర్చించారు. పలు అంశాలపై భారత్‌తో కలిసి ముందుకు సాగుతామని వారు మోదీకి హామీ ఇచ్చారు. G-20 సమ్మిట్‌లో ఉగ్రవాదం, అవినీతి నిర్మూలన అంశాలనే ప్రధానంగా ప్రస్తావించారు మోదీ. ప్రపంచానికి పెనుముప్పు ఉగ్రవాదమేననీ.. తీవ్రవాదం, జాతివివక్షకు ఊతమిచ్చే సోషల్‌ మీడియాకు చెక్ పెట్టాలని మోదీ పిలుపునిచ్చారు. పరారీ ఆర్థిక నేరగాళ్లను వదలొద్దని, వారిపట్ల కఠినంగానే వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని.

G-20 సదస్సులో వివిధ అంశాలపై చర్చలు జరిగాయి. ఇందులో ముఖ్యంగా పారిస్ వాతావరణ మార్పుల ఒప్పందం ఒకటి. పారిస్‌ వాతావరణ మార్పుల ఒప్పందానికి కట్టుబడి ఉంటామని G-20లోని 19 దేశాలు స్పష్టం చేశాయి. దీనిని సంపూర్ణంగా అమలు చేస్తామని ప్రకటించాయి. కానీ అమెరికా మాత్రం ఇందుకు ముందుకు రాలేదు. తమ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందంటూ ఈ ఒప్పందం నుంచి గతంలో వైదొలిగిన అమెరికా..ఈ సారి కూడా అదే కారణాన్ని తెరపైకి తీసుకొచ్చింది. మొత్తంగా 14వ G-20 సమ్మిట్‌ విజయవంతంగా ముగిసింది.

Tags

Read MoreRead Less
Next Story