బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత!

బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత!

సోమవారం బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరుచుకోనున్నాయి. కేంద్ర జలవనరుల శాఖ అధికారుల సమక్షంలో ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి ఏడాది జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తి ఉంచాల్సి ఉంది. దీంతో నేడు అధికారులు గేట్లను ఎత్తనున్నారు. బాబ్లీ ప్రాజెక్టుల గేట్లు ఎత్తడం ద్వారా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలలోని ఆయుకట్టుకు సాగునీరు అందుతుంది.

మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టుపై గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. జులై ఒకటి నుంచి అక్టోబరు 28 వరకు నాలుగు నెలలపాటు గేట్లు తెరిచి వుంచాలని సూచించింది.. అయితే, సుప్రీంకోర్టు నిబంధనతో మిగిలిన 8 నెలలపాటు శ్రీరాంసాగర్‌లోకిఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోతుంది. అయితే, బాబ్లీగేట్ల మూసివేతతో 0.6 టీఎంసీల నీరు ఆగిపోతున్నందున.. ఇంత పరిమాణంలో నీటిని మార్చి మొదటి వారంలో దిగువకు విడిచిపెట్టాలని కోర్టు పేర్కొంది. ఈ ఏడాది మార్చిలో ప్రాజెక్టులో నీరు లేనందున గేట్లు తెరుచుకోలేదు. దీంతో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈరోజు ప్రాజెక్టు గేట్లను ఎత్తనున్నారు.

అయితే, బాబ్లీ గేట్లు ఎత్తినా దిగువకు నీరు వచ్చే పరిస్థితి లేదు.. ఎగువన భారీ వర్షాలు కురిస్తే తప్ప బాబ్లీ ప్రాజెక్టులోకి నీరు రాదు.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు సరైన వర్షాలు కురవకపోవడంతో నీరు అడుగంటిపోయింది.. భారీ వర్షాలు కురిస్తే తప్ప దిగువకు నీరు వచ్చే పరిస్థితి లేదు. మరోవైపు బాబ్లీ గేట్లు ఎత్తనుండటంతో ఉత్తర తెలంగాణకు నీటి ఇక్కట్లు తీరినట్టేనని రైతులు అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story