వరల్డ్‌కప్‌లో టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్

వరల్డ్‌కప్‌లో టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్ పడింది.. ఇంగ్లండ్ చేతిలో భారత్ తొలి ఓటమి చవిచూసింది. 338 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసింది.. భారత్‌పై విజయంతో ఇంగ్లండ్ జట్టు సెమీస్ అవకాశాలను సజీవంగా మలుచుకుంది. అంచనాలు తారుమారయ్యాయి.. అదరగొడుతుందనుకున్న ఆరెంజ్ ఆర్మీ చేతులెత్తేసింది.. భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో టీమిండియా బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫలమయ్యారు.. దీంతో తాడోపేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆల్ రౌండ్ షోతో అదుర్స్ అనిపించింది. భారత్‌పై 31 పరుగుల తేడాతో విజయం సాధించిన ఇంగ్లండ్ జట్టు.. తన సెమీస్ అవకాశాలను పదిలంగా నిలుపుకుంది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 337 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్లు రాయ్, బెయిర్‌స్టో అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు 160 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఓపెనర్ బెయిర్‌స్టో 109 బంతుల్లో ఆరు సిక్సర్లు, పది ఫోర్లతో 111 పరుగులు చేశాడు.. బెయిర్‌స్టో మెరుపు శతకానికి తోడు బెన్‌స్టోక్స్ దూకుడు ప్రదర్శించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.. ఓ దశలో 400 స్కోర్ చేస్తుందని అనుకున్న ఇంగ్లండ్ మధ్య ఓవర్లలో తడబడినప్పటికీ స్టోక్స్ కారణంగా ఆఖరి 10 ఓవర్లలో 92 పరుగులు రాబట్టుకుంది.
338 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 306 పరుగులు మాత్రమే చేసింది. రోహిత్ శర్మ సెంచరీతో కదం తొక్కినా భారత్‌కు పరాజయం తప్పలేదు.. వోక్స్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో భారత్ ఒక్క పరుగు కూడా చేయలేకపోయంది. మూడో ఓవర్లో రాహుల్ డకౌట్ అవడంతో.. రోహిత్‌కు కోహ్లీ జత కలిశాడు. ఈ ద్వయం కుదురుకుని ఆడుతూ ఇంగ్లండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంది. 76 బంతులు ఆడి ఏడు ఫోర్లతో 66 పరుగులు చేసిన కోహ్లీ ఫ్లుంకెట్ బౌలింగ్‌లో విన్స్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత సెంచరీ పూర్తిచేసుకున్న రోహిత్ కీలక సమయంలో అవుటయ్యాడు.. ఆ తర్వాత ఏ దశలోనూ టీమిండియా విజయంవైపు పయనించలేదు. పాండ్యా ఉన్నంత సేపు మెరుపులు మెరిపించినప్పటికీ జట్టు విజయానికి ఉపయోగపడలేదు. చివర్లో ధోని, కేదార్ జాదవ్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడటంతో భారత్ 306 పరుగులు చేయగలిగింది.
ఇక భారత బౌలర్లలో షమీ 5 వికెట్లు సాధించాడు. వన్డేల్లో 5 వికెట్లు తీయడం షమీకి ఇదే తొలిసారి. బూమ్రా పొదుపుగా బౌలింగ్ చేయగా.. చాహల్ తన వన్డే కెరీర్లోనే చెత్త రికార్డును నమోదు చేశాడు.. పది ఓవర్లు బౌలింగ్ చేసిన చాహల్ ఏకంగా 88 పరుగులు ఇచ్చాడు. ఈ వరల్డ్‌కప్‌లో ఇది మూడో చెత్త ప్రదర్శన.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com