ఆంధ్రప్రదేశ్

దళితుల భూములపై గ్రావెల్ మాఫియా కన్ను

దళితుల భూములపై గ్రావెల్ మాఫియా కన్ను
X

రాజమహేంద్రవరం నుంచి కాకినాడ వెళ్లే ఏడీబీ రోడ్డు మధ్యలో పెద్దాపురం నియోజకవర్గంలో ఉంటుంది రామేశంపేట మెట్ట ప్రాంతం. ఈ మెట్ట భూమి ఐదు గ్రామాల దళితులది. రామేశంపేట, సూరంపాలెం, ఆనూరు, కొండపల్లి , వాలుతిమ్మాపురం గ్రామస్థులకు 900 ఎకరాల సారవంతమైన భూమిని ప్రభుత్వమే కేటాయించింది. ఒక్కో రైతుకు ఎకరం 35 సెంట్ల లెక్కన ఇచ్చారు అప్పటి సీఎం ఎన్టీఆర్‌. ఈ భూమిని సాగుచేసుకుంటున్నారు రైతులు. జీడిమామిడి తోటలు వేసుకుని వాటిపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ పచ్చని పంట పొలాలపై గ్రావెల్‌ మాఫియాకు కన్ను పడింది.

ఇక్కడ నాణ్యమైన గ్రావెల్‌ ఉందని గుర్తించిన గ్రావెల్ మాఫియా.. ఈ ప్రాంతంలోకి ప్రవేశించి నేల చదును చేస్తామని నమ్మబలికింది. ఆ తరువాత భూమి మీకే ఉంటుందని ఆశచూపారు. దళితుల్ని మభ్యపెట్టి వాళ్ల తోటలు లాగేసుకున్నారు. 9 వందల ఎకరాల భూమిలో దాదాపు 4 వందల ఎకరాలకు పైగా తవ్వేశారు.ఏడీబీ రోడ్డునుంచి రామేశంపేట మెట్టలోకి ప్రవేశిస్తే కనుచూపు మేర ఎక్కడా జీడిమామిడి తోటలు కనిపించవు. ఎటు చూసిన తవ్వేసిన గ్రావెల్ కొండ ఆనవాళ్లే ఉంటాయి. పెద్ద ఎత్తున గ్రావెల్‌ను తవ్వేసిన మాఫియా పెద్దలు కోట్లకు కోట్లు సంపాదించారు. ఈ గ్రావెల్ మాఫియా అంతా రాజకీయ నాయకుల బినామీలు, పారిశ్రామికవేత్త అండతోనే సాగుతుండడంతో మైనింగ్ అధికారులు ఇన్నాళ్లూ చూసీ చూడనట్టు వదిలేసారు. ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నా పట్టించుకోలేదు.

అయితే... చదునుచేయడానికి ఇచ్చినప్పుడు కొంతమొత్తం ఇస్తామని ఆ తరువాత కంపెనీలు భూమిని తీసుకుంటారని రైతులకు ఆశచూపారు. ఎకరాకి రెండున్నర లక్షల నుంచి నాలుగు లక్షలవరకు ముట్టచెప్పారు. చదును చేయడమంటే వారి ఉద్దేశంలో గ్రావెల్ తవ్వుకోవడం. ఐదు అడుగులని చెప్పి ఏకంగా 70 అడుగులపైనే తవ్వేసారు. 9/77 యాక్ట్ ప్రకారం అసైన్డ్ భూములను అమ్మకూడదు.. కొనకూడదు. కానీ ఇక్కడ ఇవేమీ అమలు కాలేదు. ఇప్పుడు ఈ ప్రాంతం గోతులమయంగా మారి వ్యవసాయానికి అస్సలు పనికిరాకుండా తయారైంది. రామేశం పేట, సూరంపాలెంలోనూ ఈ తరహాలోనే భూములు లాక్కుని గ్రావెల్ తవ్వేసుకున్నారు.

Next Story

RELATED STORIES