తెలంగాణలో అతిభారీ వర్షాలు.. కుంభవృష్టిగా మారే అవకాశం!
ఉత్తర బంగాళాఖాతంలో ఆవర్తనం ప్రభావంతో ఆదివారం ఉదయం ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. నైరుతి రుతుపవనాల విస్తరణకు, వర్షాలు పెరిగేందుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. రానున్న రెండు రోజుల్లో ఈ అల్పపీడనం బలపడనుంది. వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఓడిషా సహా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
అల్పపీడనం ప్రభావంతో ఆదివారం ఒడిసాలో విస్తారంగా, కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. ఉదయం నుంచి కోస్తాలో అనేకచోట్ల మేఘాలు ఆవరించి మధ్యాహ్నం నుంచి జల్లులు ప్రారంభమయ్యాయి. అయితే అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఎక్కువ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లాలోని శ్రీశైలంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి వర్షం కురిసింది. దీంతో భక్తులు విడిది గృహాలకే పరిమితమయ్యారు. క్షేత్రంలోని ప్రధాన వీధుల్లో వర్షపు నీరు పొంగిపొర్లింది. కర్నూలు నగరం, సున్నిపెంట, లింగాలగట్టు గ్రామాల్లోనూ ఓ మోస్తరు వర్షం కురిసింది.
ఇటు తెలంగాణలోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని, కుంభవృష్టిగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేటి నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు కురవవచ్చని అంచనా వేశారు. నైరుతి రుతుపవనాలు వచ్చిన తరువాత ఇదే తొలి అల్పపీడనం కావడంతో, అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కాగా, ఈ ఖరీఫ్ లో ఇప్పటికే పొలం పనులను ప్రారంభించిన రైతాంగం, ఈ సీజన్ ఆశాజనకంగా ఉంటుందన్న ఆశతో ఉన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com