మహిళా అధికారిపై ఎమ్మెల్యే సోదరుడి దాష్టీకం

మహిళా అధికారిపై ఎమ్మెల్యే సోదరుడి దాష్టీకం

మహిళా ఫారెస్ట్ అధికారి అనితపై.. సిర్పూరు MLA కోనేరు కోనప్ప సోదరుడు.. కోనేరు కృష్ణారావు చేసిన దాడి దుమారం రేపుతోంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అటు టీఆర్ఎస్ పార్టీలోనూ ఈ దాష్టీకంపై తీవ్ర చర్చ జరుగుతోంది. దీంతో ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం. ఇప్పటికే సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అటు కోనేరు కృష్ణారావుపై పార్టీ పరంగానూ చర్యలు తప్పవని తెలుస్తోంది. .

ఈ దాడిపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో ఫోన్లో మాట్లాడారు. కృష్ణారావుతో రాజీనామా చేయించాలని ఆదేశించారు. ఆ వెంటనే కృష్ణారావు జడ్పీ వైఎస్ ఛైర్మన్ పదవితోపాటు.. ZPTC సభ్యత్వానికి రాజీనామా చేశారు. అటు జిల్లా కలెక్టర్, డీజీపీ మహేందర్ రెడ్డి, అటవీశాఖ ఉన్నతాధికారులతోనూ సీఎం మాట్లాడారు. సమగ్రంగా విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.. అటు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ దాడిని ఖండించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని చెప్పారు. మహిళా అధికారిపై దాడి దుర్మార్గమన్నారు.

దాడి ఘటనపై ఇప్పటి వరకు కృష్ణతో పాటు 16 మందిపై కేసులు నమోదు చేశారు. కోనేరు కృష్ణారావుతోపాటు మరొకరిని అరెస్ట్ చేశారు. దాడిలో పాల్గొన్నారని భావిస్తున్న మరో 30 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అటు ఈ ఘటనలో పోలీసుల తీరుపైనా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంత మంది పోలీసులు ఉండి కూడా దాడిని అడ్డుకోలేకపోయారు. పోలీసులు చూస్తుండగానే కృష్ణారావుతో పాటు అతడి అనుచరులు రెచ్చిపోయారు. విధి నిర్వహణలో ఉన్న ఫారెస్ట్‌ అధికారులపై దౌర్జన్యానికి దిగారు. ఓ మహిళ ఉద్యోగి అని చూడకుండా ఎఫ్‌ఆర్‌ఓ అనితపై విచక్షణ రహితంగా దాడి చేశారు. అటు డీజీపీ కూడా పోలీసుల ఉదాసీనతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు...డీఎస్పీతోపాటు సీఐపైనా సస్పెన్షన్ వేటు వేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురైన అటవీభూముల్ని భర్తీ చేయడం కోసం..కొత్తసార్సాల గ్రామంలో 20 హెక్టార్లభూమిని ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ కు కేటాయించింది ప్రభుత్వం..ఈ భూముల్లో మొక్కలు నాటేందు కోసం వెళ్లారు ఫారెస్ట్‌ అధికారులు . అయితే ఇక్కడ 20 సంవత్సరాలుగా తాము వ్యవసాయం చేసుకుంటున్నామని పోడురైతులు ఎదురుతిగారు. విషయం తెలుసుకున్న కోనేరు కృష్ణ, అతని అనుచరులు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది....అటవీ భూములను స్వాధీనం చేసుకుంటున్నట్లు ఎఫ్ఆర్వో చెప్పటంతో ఒక్కసారిగా దాడికి దిగారు. వెంట తెచ్చుకున్న కర్రలతో ట్రాక్టర్ పై బాదారు. ఫారేస్ట్ రేంజ్ ఆఫీసర్ అనిత వాళ్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుండగానే కోనేరు కృష్ణ మరింత రెచ్చిపోయాడు. కృష్ణ, అతని అనుచరుల దాడిలో అనిత తీవ్రంగా గాయపడ్డారు. ఫారెస్ట్ ఆఫీసర్ అనితను హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.తనపై అకారణంగా దాడికి పాల్పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పదిమంది ఒక్కసారిగా కర్రలతో తలపై కొట్టారని, ఆ క్షణంలో తాను బతుకుతానని అనుకోలేదని కన్నీటి పర్యంతమయ్యారు. అనితను కుమ్రంభీం జిల్లా ఎస్పీ పరామర్శించారు. దాడి జరిగిన తీరుపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తాన్నారు. అటు ఈ దారుణాన్ని IFS అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అటు జడ్పీ వైస్‌ చైర్మన్‌ పదవికి, జడ్పీటీసీ సభ్యత్వానికి కోనేరు కృష్ణ రాజీనామా చేశారు. రైతులపై అటవీ అధికారుల తీరును నిరసిస్తూ జిల్లా కలెక్టర్‌కు రాజీనామా లేఖను అందజేశారు. సిర్పూర్‌ నియోజకవర్గంలో ఫారెస్ట్‌ అధికారుల అగడాలు మితిమీరాయని.. రైతులపై దౌర్జన్యం చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.

Tags

Next Story