ప్రజా దర్బార్‌ కార్యక్రమం వాయిదా!

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ప్రజా దర్బార్‌ కార్యక్రమం వాయిదా పడింది.. వాస్తవానికి సీఎం క్యాంప్‌ ఆఫీస్‌లో ప్రజా దర్బార్‌ జూలై 1 నుంచి మొదలు కావాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల డేట్‌ పోస్ట్‌ పోన్‌ చేసినట్లుగా తెలుస్తోంది.. ప్రజా దర్బార్‌ వాయిదా పడిన విషయాన్ని మంత్రి కన్నబాబు అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు ఒకటి నుంచి ఈ కార్యక్రమం నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఈనెలలో అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో సమయం కుదరకపోవచ్చననే అభిప్రాయంతోనే ప్రజా దర్బార్‌ను ముఖ్యమంత్రి జగన్‌ వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తోంది.

వ్యక్తిగత సమస్యలతోపాటు, తమ ప్రాంత సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రాలతో ప్రజలు నిత్యం క్యాంప్‌ ఆఫీస్‌ దగ్గరకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అయితే, వీరి నుంచి ఇప్పటి వరకు సీఎంవో అధికారులే వినతిపత్రాలు స్వీకరిస్తున్నారు. నేరుగా ముఖ్యమంత్రికి తమ సమస్యలు చెప్పుకునే అవకాశం లేకపోవడంతో నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది.. ఈ నేపథ్యంలో వారందరి సమస్యలు స్వయంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి జగన్‌ ప్రజా దర్బార్‌కు శ్రీకారం చుట్టారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్‌ఆర్‌ కూడా ప్రజా దర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. సామాన్య ప్రజల కోసం ప్రత్యేకంగా కొంత సమయాన్ని కేటాయించేవారు.. తాజాగా తండ్రి బాటలోనే జగన్‌ కూడా నడవాలని నిర్ణయించారు.. అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే ప్రజా దర్బార్‌ నిర్వహించాలని భావించినప్పటికీ.. అసెంబ్లీ సమావేశాలు, పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సిన నేపథ్యంలో సమయంతా అసెంబ్లీకే సరిపోతుంది. దీంతో ఈ టైమ్‌లో ప్రజా దర్బార్‌ను నిర్వహించినా ఫలితం ఉండదని జగన్‌ భావించినట్లుగా తెలుస్తోంది.. అందుకోసమే ఈ కార్యక్రమాన్ని నెలరోజులపాటు వాయిదా వేయాలని నిర్ణయించారు. మొత్తం మీద ఆగస్టు ఒకటి నుంచి ప్రజా దర్బార్‌ నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story