సార్సా దాడిపై కేంద్రం సీరియస్

తెలంగాణలోని కుమ్రం భీం జిల్లా సార్సాలలో అటవీ శాఖ అధికారులపై జరిగిన దాడిని కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. మహిళా అధికారిపై జరిపిన దాడిని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జవదేకర్ ఖండించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు కేంద్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జావదేకర్ స్పష్టంచేశారు. రాజ్యసభలో కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ లేవనెత్తిన అంశంపై జావదేకర్ స్పందించారు. ఇలాంటి ఘటనల్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టంచేశారు. వాటిని నియంత్రించేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత దీనిపై ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.
సార్సాలలో ఆదివారం అటవీశాఖ అధికారులపై అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు జడ్పీ వైస్ ఛైర్మన్ కృష్ణ తన అనుచరులతో దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో అటవీశాఖ రేంజ్ అధికారిణి అనిత తీవ్రంగా గాయపడ్డారు. ఆమె ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడి ఘటనలో ఇప్పటికే 13మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు పోలీసు అధికారులను కూడా సస్పెండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com