ఆకస్మిక తనిఖీలు చేస్తాను : సీఎం జగన్
ఏపీ సీఎం వరస సమీక్షలతో బిజీ అయ్యారు. రాష్ట్ర వాప్తంగా జరిగిన స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలిస్తున్న వినతిపత్రాలకు రసీదులు ఇవ్వాలని, ఏ తేదీలోపు పరిష్కరిస్తారో వాటిపై రాసివ్వాలని అధికారులకు సీఎం సూచించారు. ఇచ్చిన రసీదులను కంప్యూటరీకరించి బేటా బేస్‌లో పెట్టాలని ఆదేశించారు. వీటిపై కలెక్టర్లు, ఎస్పీలు నిరంతరం సమీక్షించాలన్నారు. నిర్ణీత గడువులోగా అధికారులు ప్రజల సమస్య పరిష్కరిస్తున్నారో, లేదో పర్యవేక్షించాలని సూచించారు. అలాగే కలెక్టర్లు, ఎస్పీలు ఆకస్మిక తనిఖీలు చేయాలని, తానూ కూడా ఆకస్మిక తనిఖీలు చేపడతానని స్పష్టంచేశారు. ప్రతి మంగళవారం అరగంట సేపు కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు సిఎం జగన్ స్పష్టంచేశారు.
తరువాత సచివాలయంలో గృహనిర్మాణ శాఖపై సీఎం సమీక్ష చేశారు. పట్టణ, గ్రామీణ గృహాల నిర్మాణ పరిస్థితిపై పూర్తి సమాచారాన్ని అధికారులు వివరించారు. అయితే గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన అర్బన్ హౌసింగ్‌లో అక్రమాలు, అవినీతిపై దృష్టి పెట్టాలన్నారు సీఎం. లబ్ధి దారుల నుంచి పైసా కూడా వసూలు చేయకూడాదని ఆయన సూచించారు.
అంతకుముందు అమెరికా కాన్సూల్ జనరల్ క్యాథరీన్ బీ హడ్డా ముఖ్యమంత్రిని కలిశారు. పలు అంశాలపై ఇరువురు చర్చించుకున్నట్టు తెలుస్తోంది. లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైఎస్ జగన్ కు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో అమెరికా, ఆంధ్రప్రదేశ్ మధ్య మంచి సంబంధాలు కొనసాగాలని ఆశిస్తున్నామన్నారు.
మరోవైపు ఉన్నతాధికారులు, పోలీసులతో హోం మంత్రి సుచరిత సమీక్ష చేశారు. మాజీ సీఎం చంద్రబాబు భద్రత తగ్గించారనే ఆరోపణలపై సుచరిత స్పందించారు. చంద్రబాబుకు భద్రత తగ్గించలేదని ఆమె స్పష్టం చేశారు. జడ్ ప్లస్ భద్రత కొనసాగుతోంది అన్నారు. 58 మందితో ఇవ్వాల్సిన చోట .. 74 మందితో భద్రత కల్పిస్తున్నామని వివరించారు.. చంద్రబాబు ప్రైవేటు ఆస్తులకు భద్రత కల్పించాల్సిన అవసరం లేదని.. ఇప్పటికే ఆయన సీఎంననే ఫీలింగ్‌లో ఉన్నారని సుచరిత ఆరోపించారు.
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. విద్యాశాఖపై ఆర్థిక శాఖమంత్రితో సమీక్ష నిర్వహించారు. రాబోయే బడ్జెట్‌లో విద్యా రంగానికి పెద్ద పీట వేయాలని కోరారు. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com