ముంబై మునిగింది!

మహారాష్ట్ర కరువు తీరా వర్షాలు కురుస్తున్నాయి. విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతుండగా.. ముంబైకర్లు మాత్రం క్షణమొక యుగంలా గడుపుతున్నారు. ఇప్పటికే నాలుగు రోజులుగా కుండపోత కురుస్తోంది. గురువారం వరకు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ చేసిన హెచ్చరిక ముంబైకర్లలో మరింత భయాందోళన రేకెత్తిస్తోంది.
మధ్యాహ్నం కాసేపు వర్షాలు తెరిపినివ్వడంతో ముంబైకర్లు ఊపిరి పీల్చుకున్నారు. నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు బయటకు వచ్చారు. అదే సమయంలో NDRF బృందాలు సహాయ, పునరావాస కార్యక్రమాలను ముమ్మరం చేశాయి. లోతట్టు ప్రాంతాల నుంచి నీటి తోడివేత వేగం పుంజుకుంది. మరోవైపు.. బృహన్ ముంబై నగరపాలక సంస్థ కార్యాలయానికి వెళ్లారు సీఎం ఫడ్నవీస్. అక్కడి హెల్ప్‌లైన్ సెంటర్‌ను పరిశీలించారు. నగరంలో ఎక్కడెక్కడ, ఎంత నష్టం జరిగింది, సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయో స్వయంగా పర్యవేక్షించారు.
ముంబై దాదాపు మునిగిపోయింది. ఎక్కడ చూసినా నడుములోతు నీళ్లు కనిపిస్తున్నాయి. మహా నగరంతో పాటు శివార్లలోను అలాంటి పరిస్థితే నెలకొంది. పురాతన భవనాలు, గోడలు కూలడంతో దాదాపు పాతిక మంది చనిపోయారు. మరికొందరు గాయాలతో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు ఐదేసి లక్షల సాయం ప్రకటించారు ముఖ్యమంత్రి ఫడ్నవీస్.
ముంబైలో ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. లైఫ్‌లైన్‌గా చెప్పుకునే లోకల్ ట్రెయిన్లు ఎక్కడివక్కడా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. పట్టాలపై నీళ్లు పూర్తిగా తొలిగిపోతే కానీ వాటిని పునరుద్ధరించే పరిస్థితి లేదు. అటు విమాన సర్వీసులు గాడి తప్పాయి. సుమారు 50 సర్వీసులు రద్దవగా.. మరో 50 సర్వీసులను దారి మళ్లించారు. విమానాశ్రయం మూతపడిందా, పనిచేస్తోందా అని పలువురు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. వాన తెరిపినిచ్చినప్పుడల్లా అధికార యంత్రాంగం రిపేర్లు చేస్తూ.. నష్ట తీవ్రతను తగ్గించే పని చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com