కూలీ బిడ్డ.. సర్కారు బడిలో చదివి 'ఐఐటీ'లో ర్యాంకు..

కూలీ బిడ్డ.. సర్కారు బడిలో చదివి ఐఐటీలో ర్యాంకు..

చుట్టు పక్కల పిల్లలంతా ప్రైవేటు స్కూళ్లకు వెళుతున్నారు. వాకిట్లోకి బస్సు వస్తే అమ్మో నాన్నో వచ్చి బస్సెక్కించి టాటా చెప్తారు. పవిత్రకి అలాంటి అనుభవాలు ఏవీ లేవు. తల్లీ.. బడికెళ్లి బాగా చదువుకో. నాలాగా కూలి పని చేయకూడదు. బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలి. మన బతుకులు బాగు పడాలి అన్న తల్లి మాటలను అక్షరాలా ఆచరించే ప్రయత్నం చేస్తోంది పవిత్ర. సర్కారు బడికి వెళుతూ ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు తీసిపోని విధంగా చదివి పదవతరగతిలో మంచి మార్కులు సాధించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియెట్ చదివింది పవిత్ర. తల్లి ధనలక్ష్మి రోజూ కూలి పనికి వెళుతుంది. మీ అమ్మాయి బాగా చదువుతుంది మధ్యలో చదువు మాన్పించే ప్రయత్నాలేవీ చేయకు అని స్కూలు మాష్టార్లు పవిత్ర గురించి చెబుతుండేవారు తల్లికి ఎప్పుడూ. చదువుల తల్లి సరస్వతీ దేవి తన ఇంట్లోనే ఉందని బిడ్డని చూసుకుని మురిసిపోయేది ఆమె.

ఇంటర్‌లో 936 మార్కులు సాధించి కాలేజీ లెక్చరర్ల ప్రశంసలు పొందింది పవిత్ర. తరువాతి చదువుల కోసం ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల్లో మంచి స్కోర్ సాధించింది. ర్యాంకుల కోసం కోచింగ్ సెంటర్స్‌కి వెళ్లే ఆర్థిక స్థోమత లేదు పవిత్రకి. అందుకే అందుబాటులో ఉన్న పుస్తకాలన్నీ చదివేది. కాలేజీ లెక్చరర్ల సాయం తీసుకుని వారి సూచనలు, సలహాలతో కష్టపడి ర్యాంక్ సాధించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఎస్సీ కేటగిరీలో 2వేల 954 ర్యాంకు సాధించింది. కౌన్సిలింగ్‌లో పవిత్రకి ఐఐటీ ధన్‌బాద్‌లో సీటు లభించింది. జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ ఈ విషయాన్ని ప్రకటించింది. చదువుపై శ్రద్ధ వహించి ఇష్టంగా కష్టపడితే విజయం సాధించవచ్చని.. ప్రైవేట్ స్కూల్స్‌, కాలేజీలకు ప్రభుత్వ పాఠశాలలు ఏమాత్రం తీసిపోవని అంటున్నారు అధ్యాపకులు.

Tags

Read MoreRead Less
Next Story