నితీశ్ ప్రభుత్వం అందించిన తీపి కానుకలపై రాజకీయ రచ్చ
చట్టసభ సభ్యులకు నితీశ్ ప్రభుత్వం తీపి కానుకలు అందజేసింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ ఏడు తాజా మామిడి పండ్ల ప్యాక్, సంచిలో మొక్క ఇచ్చింది. ఇదిప్పుడు రాజకీయ రచ్చకు దారితీసింది. మెదడువాపుతో పిల్లలు చనిపోతుంటే.. ఆ వ్యాధి నియంత్రణపై దృష్టి పెట్టని ప్రభుత్వం.. సమస్య నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తోందని ఆర్జేడీ నేతల విమర్శ.
బీహార్ అసెంబ్లీలో సోమవారం మెదడువాపు మరణాలపై చర్చ జరిగింది. 150 మంది పిల్లలు చనిపోయారని వైద్య, ఆరోగ్య శాఖను చూస్తున్న సీఎం నితీశ్ తెలిపారు. ఇదే అంశంపై ఓటింగ్ కోరుతూ వాయిదా తీర్మానాలు ప్రవేశపెడుతున్న ఆర్జేడీ.. మామిడి పండ్ల పంపిణీని తీవ్రంగా తప్పుపట్టింది.
ప్రభుత్వ వాదన మరోలా ఉంది. వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆ శాఖ ఫ్రూట్స్ పంపిణీ చేసిందని.. స్వీట్స్ పంచలేదు కదా అంటూ మంత్రి కౌంటర్ ఇచ్చారు. బీహార్ మామిడి క్రేజ్, పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని తెలియజేసేందుకే ఈ పని చేశామన్నారు.
మెదడువాపు నివారణకు ప్రభుత్వం అన్నిచర్యలూ తీసుకుందని మంత్రులు చెప్తుండగా.. బీజేపీ, జేడీయు నేతలు మామిడిపండ్లు తినొచ్చని, ప్రభుత్వ అసమర్ధతపై తాము పోరాటం కొనసాగిస్తామని ప్రతిపక్షం స్పష్టంచేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com