తెలంగాణలో విధులకు హాజరుకాని వైద్యులపై కఠిన చర్యలు

తెలంగాణలో విధులకు హాజరుకాని వైద్యులపై కఠిన చర్యలు
X

తెలంగాణాలో విధులకు హాజరు కాని డాక్టర్లపైన సర్కార్ చర్యలకు సిద్ధమైంది. సూపర్ స్పెషాలిటి డాక్టర్లకు ఇప్పటికే ప్రభుత్వం నోటీసులు అందజేసింది. స్పందించని వైద్యులపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైంది. మరో రెండ్రోజుల్లో వైద్య విధానపరిషత్ పరిధిలో నియమితులై.. విధులకు హాజరుకాని 86మంది వైద్యులపై చర్యలు తీసుకుంటూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. వీరిని శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగించి షాక్ ఇచ్చేందుకు ఫైల్ రెడీ అయింది.

తెలంగాణా వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆసుపత్రుల్లో 911 పోస్టులను గతేడాది భర్తీ చేసింది ప్రభుత్వం. అయితే నియామకం పూర్తయ్యాక అందులో కొందరు వైద్యులు చేరకపోవడంతో సమస్య మొదలైంది.. 120మందికి పైగా స్పెషాలిటి వైద్యులు చేరకపోవడంతో వారికి నోటీసులు ఇచ్చారు. కొంత మంది మాత్రమే నోటీసులకు స్పందించి వివరణ ఇచ్చారు. 86మంది ఎలాంటి వివరణ ఇవ్వలేదు. విధులకు హాజరుకావట్లేదు. వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రభుత్వ నోటీసులకు స్పందించిన వారి జాబితాను వైద్య విధానపరిషత్ అధికారులు సిద్దం చేశారు. సచివాలయంలోని జీఏడీకి కూడా పంపినట్టు సమాచారం. ఆ జాబితాను పరిశీలించిన జీఏడీ.. 86 మంది పేర్లతో మరో రెండ్రోజుల్లో చర్యలు తీసుకుంటూ గెజిట్ విడుదల చేయనుంది. అయితే అంతకంటే ముందు చివరగా నాలుగు రోజులు గడువు ఇచ్చే అవకాశం ఉంది. అప్పటికీ స్పందించకపోతే వారందర్నీ శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగించనున్నారు. అలా చేస్తే తెలంగాణలోకఠిన చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి అవుతుంది. ఎలాంటి చర్యలు తీసుకున్నా న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా పక్కాగా నోటిఫికేషన్ సిద్దం చేస్తోంది ప్రభుత్వం.

Tags

Next Story