12 కి.మీ. నడిచి వచ్చి మహిళకు పురుడు పోసిన నర్సు

12 కి.మీ. నడిచి వచ్చి మహిళకు పురుడు పోసిన నర్సు

ఆసుపత్రికి వెళ్లేందుకు రోడ్డు లేదు.. వైద్య సదుపాయాలు అంతకన్నా లేవు. ఓ గర్బిణీ పురిటి నొప్పులతో బాధపడుతుంటే ఏం చేయాలో అర్ధం కాలేదు గ్రామస్తులకు. ద్విచక్రవాహనం వెళ్లేందుకు కూడా రోడ్డు లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోలేదు. కష్టపడి ఓ ఆసుపత్రికి ఫోన్లో సమాచారం మాత్రం అందించగలిగారు. ఫోన్లో వివరాలు తెలుసుకున్న ఏఎన్ఎం ఒకరు మానవత్వం చాటుకున్నారు. అడవిలో 12 కిలోమీటర్ల నడుచుకుంటూ వచ్చి తల్లీ బిడ్డను కాపాడారు. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

గాదిగూడ మండలం పావునూర్ సమీపంలోని లొద్దిగూడ గ్రామానికి చెందిన సిడాం జంగు అనే మహిళకు... పురిటినొప్పులు మొదలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించాల్సి ఉన్నా.. సదుపాయాలు లేక ఇబ్బంది పడ్డారు. ఇటీవల వర్షాలకు ఉన్న మట్టిరోడ్డు కూడా నడవడానికి వీల్లేకుండా మారింది. దీంతో తల్లిబిడ్డ గురించి గ్రామాస్తుల్లో ఆందోళన నెలకొంది. అయితే కొందరు ఫోన్ చేసి సమీపంలోని డాబా-బీ గ్రామంలో హెల్త్ సెంటర్ కు సమాచారం అందించారు. విధుల్లో ఉన్న ఏఎన్ఎం శ్రీదేవి వెంటనే స్పందించారు. కావాల్సిన మందులు తీసుకుని కాలినడకన 12 కిలోమీటర్ల వచ్చారు. చివరకు పురుడు పోసితల్లిబిడ్డను కాపాడారు.

పురుడు పోసిన సమయంలో సరైన వైద్యపరికరాలు లేకపోవడంతో తీవ్రంగా తల్లికి తీవ్ర రక్తశ్రావమైంది. దీంతో వారిని వెంటనే మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించాలని ఆమె సూచించారు. దీంతో ఎడ్లబండి కట్టి.. డాబా గ్రామం వరకూ తరలించారు. అక్కడి నుంచి 108లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం తల్లి బిడ్డా క్షేమంగా ఉన్నట్టు తెలిపారు. తమ గ్రామ మహిళను కాపాడాలని ఎఎన్ఎంకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. తమకు ఇప్పటికైనా రోడ్డు సదుపాయం కల్పించాలని గ్రామస్తులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నర్సు సమయానికి రాకపోతే తమ గ్రామం విషాదంలో మునిగిపోయేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story