అవసరమైతే నేనే కార్యకర్తలకు రక్షణ కవచంలా నిలబడుతా : చంద్రబాబు
అమరావతిలో పార్టీ నేతలతో సమావేశమైన చంద్రబాబు నాయుడు పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం కార్యకర్తలపై పెరిగిపోయిన దాడుల గురించి చర్చించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ దాడులు చేయడం సరికాదని అన్నారు. ఈ దౌర్జన్యాలను ఆపేంత వరకు పోరాటం కొనసాగుతుందన్నారు చంద్రబాబు. అవసరమైతే తానే కార్యకర్తలకు రక్షణ కవచంలా నిలబడుతానని చెప్పారు.
తనను వెంటాడటమే టార్గెట్ గా జగన్ వ్యవహరిస్తున్నారని అన్నారు చంద్రబాబు. పరిష్కారం చేతకాక ప్రతి సమస్యకు టీడీపీపై నెపం వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు . ప్రజావేదిక కూల్చడంతోనే వైసీపీ పతనం ప్రారంభమైందన్నారు. గుంటూరు పార్టీ కార్యాలయానికి రోజూ వస్తున్నానని...ఆ భవనానికి కూడా నోటీసులు పంపేలా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వరుస తప్పులతో వైసీపీ నేతలు వాళ్ల గుంతలు వాళ్లే తవ్వుకుంటున్నారని అన్నారు చంద్రబాబు. ప్రశాంతంగా ఉండే కుప్పంలోనే బ్యానర్లతో రగడ చేశారని ఆరోపించారు. తన నియోజకవర్గంలోనే ఫ్లెక్సీల ద్వారా ఉద్రిక్తత తెచ్చి ఘర్షణలకు ప్రేరేపించారంటే, ఇక మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి ఎంటో అర్ధం చేసుకోవచ్చన్నారు. దాడులకు గురైన పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలని సీనియర్లకు సూచించారు చంద్రబాబు
గత ఐదేళ్లుగా కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా రాత్రి పగలు అభివృద్ధి కోసమే పనిచేశానని చెప్పారు చంద్రబాబు. ఈగోలు, ఈర్ష్యలు పక్కన పెట్టి పేదల కోసం పనిచేయాలని నేతలకు సూచించారు. గతంలో ఓడినప్పుడు కొన్ని పనులు చేయలేకపోయమనే బాధ ఉండేదని కానీ ఈసారి అన్ని పనులు చేసినా ఓటమి ఎదురైందని చెప్పుకొచ్చారు.. సంక్షోభాలకు కుంగిపోవద్దని.. దీన్నే ఓ అవకాశంగా మార్చుకొని మళ్లీ పార్టీని శక్తివంతంగా తీర్చిదిద్దాలని నేతలు దిశానిర్దేశం చేశారు. అటు చంద్రబాబుతోపాటు ఆయన కుటుంబానికి భద్రత తగ్గించడంపైనా సమావేశంలో చర్చించారు..
ఇబ్బందుల్లో ఉన్న రైతులకు సంఘీభావం తెలపాలని పార్టీ నేతలకు సూచించారు చంద్రబాబు. అన్నదాత సమస్యల పరిష్కారానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ తరఫున ఒక కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించారు...విత్తనాల కొరత, విద్యుత్ కోతలు, సాగునీటి కొరత, కరవు పరిస్థితులు ఉన్న ప్రాంతాలలో ఆ కమిటీ సభ్యులు పర్యటిస్తారని తెలిపారు.పరిష్కార మార్గాలపై రాబోయే అసెంబ్లీ వేదికగా చర్చిస్తామని తెలిపారు చంద్రబాబు. ఇక వృద్ధిరేటుపై మాట్లాడొద్దని సీఎం జగన్ కు అధికారులు సూచించడాన్ని సమావేశంలో ప్రస్తావించారు నేతలు.వృద్ధిరేటును గాలికి వదిలేస్తే పరిశ్రమలు ఏవిధంగా తెస్తారని, పెట్టుబడులు ఎలా వస్తాయని నిలదీశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com