ప్రయాణికులకు షాక్‌ ఇస్తున్న మెట్రో

ప్రయాణికులకు  షాక్‌ ఇస్తున్న మెట్రో

మెట్రో జర్నీ.. ప్రయాణికులకు వరుస షాక్‌లు ఇస్తూనే ఉంది. ఏ రూటులో ఏ రైలుకు ఎప్పుడు బ్రేక్ ప‌డుతుందో తెలియక ప్రయాణికులు కన్ఫ్యూజ్‌ అవుతున్నారు. చిన్న చిన్న సాంకేతిక కార‌ణాల‌కు తోడు.. కాలుష్యంతో మెట్రో రైలు ప్రయాణానికి సడన్‌గా బ్రేకులు పడుతున్నాయి..

వర్షాకాలం ట్రాఫిక్‌ ఇబ్బందులకు భయపడిన హైదరాబాద్‌ నగర ప్రయాణికులు.. మెట్రో జర్నీపై ఆసక్తి చూపిస్తున్నారు. రోడ్డు మార్గంలో ట్రాఫిక్‌లో ఇరుక్కుని ఇబ్బందులు ప‌డేకంటే అత్యంత వేగంగా గ‌మ్య స్థానాల‌కు చేర్చే మెట్రో రైల్ బెటర్‌ ఆప్షన్‌ అనుకుంటున్నారు. ఏడాదిన్నర కింద‌ట మియాపూర్ నుంచి నాగోలు వ‌ర‌కూ ప్రారంభ‌మైన మెట్రో రైల్‌కు ఆరంభంలోనే ఆద‌ర‌ణ అదిరింది. ఆ త‌ర్వాత అమీర్ పేట‌-ఎల్బీన‌గ‌ర్, అమీర్ పేట‌- హైటెక్ సిటీ మార్గాలు అందుబాటులోకి వ‌చ్చాయి. మొత్తం 56 కిలోమీట‌ర్ల మేర మెట్రో రైల్ న‌గ‌రంలో ప‌రుగులు పెడుతుండ‌గా ప్రయాణికుల సంఖ్య కూడా అందుక‌నుగుణంగానే పెరుగుతోంది. నిత్యం 2 లక్షల 75 వేల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు.

ప్రస్తుతం నాగోలు- మియాపూర్ మార్గంలో ప్రతీ రెండున్నర నిమిషాల‌కు ఓ రైలు అందుబాటులో ఉండ‌గా, అమీర్ పేట‌- ఎల్పీన‌గ‌ర్ రూట్‌లో కూడా అదే టైమింగ్‌తో రైళ్ళు న‌డుస్తున్నాయి.

అమీర్ పేట్‌‌- హైటెక్ సిటీ మార్గంలో మాత్రం ప్రయాణికుల క‌ష్టాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ మార్గంలో ప్రతీ ఎనిమిది నిమిషాల‌కు ఓ రైలు అందుబాటులో ఉండేలా షెడ్యూల్ రూపొందించారు. అయితే ఈ రూటులో రివ‌ర్సల్ స‌దుపాయం లేక‌పోవ‌డంతో పాటు సాంకేతిక కార‌ణాలతో ప్రతీ రోజూ ఏదో ఓ స్టేష‌న్‌లో మెట్రో ఆగిపోతోంది.

హైదరాబాద్ మెట్రో రైల్ ను కాలుష్య భూతం భయపెడుతోంది. ఇప్పటి వరకూ మానవ, జంతు, జీవరాశులకు మాత్రమే ప్రాణాంతకంగా తయారైన కాలుష్యం... అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే యంత్రాల పైనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

ప్రపంచంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హైదరాబాద్ మెట్రో రైలు వ్యవస్థను రూపొందించారు. ఇంతటి ఉన్నత వ్యవస్థపై కాలుష్యం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. కాలుష్యం కారణంగా సిగ్నలింగ్‌లో సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో రైళ్ళు ఆలస్యంగా నడుస్తున్నాయి. స్టేషన్లలో మెట్రో తలుపులు తెరుచుకోకపోవడం.. మరికొన్నిచోట్ల మధ్యలోనే తలుపులు తెరుచుకోవడం, అధిక వైబ్రేషన్, నెమ్మదిగా వెళ్లడంలాంటి సమస్యలు ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నాయి.

మరోవైపు మెట్రో రూట్‌లో ఉన్న ఫ్లెక్సీలు ఈదురు గాలులకు పట్టాలపైన పడడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. డ్రైవర్ లెస్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న అత్యాధునిక వ్యవస్థ మన హైదరాబాద్ మెట్రో. ప్రస్తుతం నడుస్తున్న మెట్రోలో డ్రైవర్లు ఉన్నా.. స్టేషన్ రాగానే తలుపు తెరుచుకోవడం మూసుకోవడం కోసం మాత్రమే బటన్ ప్రెస్ చేసేందుకు వాళ్ళు పరిమితం. హైదరాబాద్ మెట్రోకు ఫ్రాన్స్‌కి చెందిన థాలెస్ కంపెని సాంకేతికతను అందించింది. సమాచార ఆధారిత వ్యవస్థ ఆధారంగా హైదరాబాద్ మెట్రో రైల్ నడుస్తోంది. ట్రాక్, సేఫ్టీ క్లియరెన్స్, సిగ్నలింగ్ వంటి వాటిలోఏది పని చేయకున్నా మెట్రో రైలు కదలదు..

దుమ్ము, ధూళి, కాలుష్యం, వాతావరణంలో మబ్బులు పట్టినప్పుడు సిగ్నలింగ్‌లో సమస్యలు కలుగుతున్నాయి.ఈ సమస్యను అధిగమించేందుకు ఫ్రాన్స్ సంస్థతో మెట్రో ఇంజనీర్లు సంప్రదించారు. పెరుగుతున్న కాలుష్యం స్థాయిలో తట్టుకునేలా సిగ్నల్ ట్రాక్ ట్రైన్ కంట్రోల్ సిస్టంలో, కంట్రోల్ సిస్టమ్‌ల్లో మార్పు చేయాలని ఎల్ అండ్ టీ కి మెట్రో ఎం.డీ. NVS రెడ్డి సూచించారు. మెట్రో రైలు ప్రారంభమైన ఆరునెలల్లోనే రైళ్లు నిలిచిపోయిన సంఘటనలు వ‌రుసగా ఇబ్బంది పెడుతున్నాయి. అప్పట్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవ‌డంలో మెట్రో యాజ‌మాన్యం నిర్లక్ష్యం వ‌హించింది. ఇదే స‌మ‌స్య పునరావృతం అవుతుండడంపై విమర్శలు పెరుగుతున్నాయి.

Tags

Next Story