ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఇసుక విధానంలో కీలక మార్పులు

ఏపీలో ఇసుక విధానంలో కీలక మార్పులు
X

ఏపీలో కొత్త ఇసుక విధానంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు..ప్రస్తుత విధానంలో పలు కీలక మార్పులు సూచించారు. ఇసుకను ఏపీఎండీసీ ద్వారా విక్రయించాలని నిర్ణయించారు. ఇసుక స్టాక్‌యార్డుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడమే కాకుండా.. బయటకు వెళ్లేటప్పుడు కూడా వే బ్రిడ్జి ద్వారా లెక్కింపు చేపట్టాలన్నారు. అక్రమాలను అడ్డుకునేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం తెలిపారు. రీచ్‌ నుంచి ఇసుకను స్టాక్‌యార్డు వద్దకు తరలించేందుకు ఒక రశీదు .. స్టాక్‌యార్డు నుంచి వినియోగదారుడికి చేరేంతవరకూ మరొక రశీదు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు జగన్.

ఇసుక తవ్వకాలు, తరలింపులో వాడే వాహనాలకు జీపీఎస్‌ తప్పనిసరి ఉండాలని ఆదేశించారు సీఎం. మాఫియా, అక్రమాలు, అవకతవకలు, కల్తీలకు దారితీయకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. అక్రమ తవ్వకాలు, రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2 నెలల వ్యవధిలో ఇసుక రవాణా వాహనాలను గుర్తించి, వాటికి జీపీఎస్‌ అమర్చాలని ఆదేశించారు. ఇసుక వినియోగదారుల కోసం ఒక యాప్, వెబ్‌ పోర్టల్‌ను ఏపీఎండీసీ తయారుచేయనుంది. కొత్త విధానం అమల్లోకి వచ్చేంతవరకూ ఇసుక అందించే బాధ్యతను కలెక్టర్లు కొనసాగించనున్నారు.

2 నెలల్లోగా అదనపు రీచ్‌లను గుర్తించి... డిమాండ్‌కు తగినట్టుగా ఇసుకను అందించనుంది ఏపీ ఎండీసీ.ప్రభుత్వానికి, వినియోగదారుడికి పరస్పరం మేలు జరిగేలా ధరను నిర్ణయించనున్నారు. కోరిన వెంటనే ఇసుకను అందుబాటులో ఉంచేలా రవాణావ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని సమీక్షలో అధికారుల్ని ఆదేశించారు సీఎం జగన్.

Next Story

RELATED STORIES