నా భర్త కనిపించడం లేదు.. మీరు ఆయన్ని ఎక్కడైనా చూసి ఉంటే..

ఎంత భారీ బడ్జెట్‌తో సినిమా తీసినా అంతే భారీగా ప్రమోట్ చేస్తేనే జనాల్లోకి వెళుతుంది. అందుకోసం ఎన్ని జిమ్మిక్కులైనా చేస్తుంది చిత్ర యూనిట్. ఒక్కోసారి అవే ఆడియన్స్‌కి బాగా రీచ్ అవుతుంటాయి. సినిమా సక్సెస్‌కి కారణమవుతుంటాయి. అయితే ఇక్కడ మలయాళ నటి ఆశా శరత్‌కి మాత్రం నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈమె అనుష్క నటించిన భాగమతి సినిమాలో పోలీస్ అధికారిగా నటించింది. తాను మలయాళంలో నటించిన చిత్రం 'ఎవిడే'. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇటీవల ఆశా తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో నా భర్త కనిపించడం లేదు.. మీరు ఆయన్ని ఎక్కడైనా చూసి ఉంటే కేరళలోని కట్టప్పన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి అని పేర్కొన్నారు. మేకప్ లేకుండా బాధపడుతున్న ఫోటోని పెట్టి మరీ పోస్ట్ చేసేసరికి నెటిజన్లు నిజమే అనుకున్నారు. ఓ లాయర్ ఆమెని ఆ పరిస్థితిలో చూడలేక.. భర్త కనిపించక ఆమె ఎంత ఇబ్బంది పడుతుందో అని వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విషయం సీరియస్ అవడంతో.. ఇది సినిమా ప్రమోషన్లో భాగమని అసలు విషయం బయటపెట్టింది ఆశా. ఎవరినైనా తాను ఇబ్బంది పెట్టి వుంటే క్షమించమని కోరింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com