కార్పొరేట్ ట్యాక్స్ విధానంలో మార్పులు

2019-20 ఆర్థిక సంవత్సరానికి మోడీ ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రకటించింది. ఆశించిన నిర్ణయాలు కొన్ని, ఊహించని విధానాలు మరికొన్ని... ఇలా నిర్మలా సీతారామన్ బడ్జెట్‌... మిశ్రమంగానే కనిపించింది. ఈ బడ్జెట్ మొత్తం ఆదాయం అంచనా 27,86,349 లక్షల కోట్ల రూపాయలు. ఇందులో పన్నుల ద్వారా వచ్చే మొత్తం ఆదాయం 24.61 లక్షల కోట్లు. జీఎస్‌టీ ద్వారా 6.63 లక్షల కోట్ల ఆదాయం అంచనా వేశారు. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన 8.09 లక్షల కోట్లను తీసేస్తే.. నికర పన్ను వసూళ్లు 16.49 లక్షల కోట్లుగా నిలుస్తున్నాయి.

కార్పొరేట్ వర్గాలు ఎంతకాలంగానో ఎదురుచూస్తున్న కార్పొరేట్ ట్యాక్స్ విధానంలో మార్పులు తీసుకువచ్చారు. 400 కోట్ల రూపాయల వరకు టర్నోవర్ కలిగిన కంపెనీలకు కార్పొరేట్ ట్యాక్స్‌ను 25 శాతానికి తగ్గించారు. దీంతో 99.3 శాతం కార్పొరేట్ ప్రపంచానికి మేలు చేకూరచనుంది. జీఎస్‌టీ రిజస్టర్ చేసుకున్న వ్యాపారాలకు రిటర్న్ దాఖలు చేయడాన్ని సులభతరం చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు..

ఇక బడ్జెట్ అనగానే వేటి ధరలు పెరుగుతాయి... వేటి రేట్లు తగ్గుతాయి అనే సామాన్యుడు ఎదురుచూస్తాడు. ఆటోమొబైల్ విడి భాగాలు, ఆప్టికల్ ఫైబర్స్, డిజిటల్ కేమెరా, జీడిపప్పు, నిర్ణీత సింథటిక్ రబ్బర్ రకాలు, వినైల్ ఫ్లోరింగ్‌పై... కస్టమ్స్ సుంకం పెరిగింది. కొన్ని రకాల ఎలక్ట్రానికి వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. ప్రధానంగా ఈ బడ్జెట్‌లో ప్రజలపై విధించిన వడ్డింపుల గురించి చెప్పాలంటే.. బంగారం, చమురు ధరలే. బంగారంతో పాటు విలువైన లోహాలపై కస్టమ్స్ డ్యూటీని 10 నుంచి 12.5 శాతానికి పెంచుతూ అనూహ్య నిర్ణయం ప్రకటించారు ఆర్థిక మంత్రి. అలాగే పెట్రోల్, డీజిల్‌పై ఒక్కో రూపాయి చొప్పున అదనంగా సెస్ విధించనున్నారు. ప్రస్తుతం వీటిపై 8 రూపాయల సెస్ ఉండగా... ఇప్పుడిది రూ.9కి చేరుతోంది. వీటితో పాటు పొగాకు ఉత్పత్తులపై కొంత ఎక్సైజ్ సుంకం పెంపును విధించారు. సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీల విషయంలో వచ్చే వివాదాల పరిష్కారం కోసం లెగసీ డిస్పూట్ రిజొల్యూషన్ స్కీమ్‌ను ప్రతిపాదించారు.

ఇక ఉద్యోగులు, సామాన్యులపై నేరుగా ప్రభావం చూపే నిర్ణయాల విషయానికి వస్తే, PFRDA నుంచి నేషనల్ పెన్షన్ స్కీమ్ ట్రస్ట్‌ను విడదీయాలని నిర్ణయించారు. ఆర్థిక లావాదేవీలు, ముఖ్యంగా ట్యాక్స్ ఫైలింగ్ కోసం పాన్, ఆధార్ కార్డ్‌లను ఒకదానికి బదులు మరొకటి చొప్పున ఉపయోగించుకోవచ్చని ఆర్థిక మంత్రి ప్రకటించారు. అలాగే వేతనాలు, బ్యాంక్ వడ్డీ, మూలధన లాభం, డివిడెండ్ ఆదాయం వంటివాటిని... ఆటోమేటిక్‌గా ట్యాక్స్ రిటర్న్స్‌లో ఉండేలా చర్యలు తీసుకోబోతున్నారు.

ఆటోమొబైల్ రంగాన్ని ఎలక్ట్రిక్ సెగ్మెంట్ వైపు నడిపించాలనే NDA లక్ష్యం దిశగా మరి కొన్ని అడుగులు... ఈ బడ్జెట్‌లో పడ్డాయి. ఎలక్ట్రిక్ కార్స్‌పై జీఎస్‌టీని 12 నుంచి 5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాన్ని లోన్‌పై కొనుగోలు చేస్తే.. వారి ట్యాక్స్ శ్లాబ్ ఆధారంగా... మొత్తం లోన్ టెర్మ్‌లో రూ. 2.5 లక్షల వరకు వడ్డీపై రాయితీ పొందవచ్చు. అలాగే ఆదాయపు పన్నులో గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story