తెలుగు భాష తప్పనిసరి సబెక్ట్‌ : సీఎం జగన్

విద్యారంగంలో మార్పులపై నిపుణుల కమిటీతో తన ఆలోచనలను పంచుకున్నారు ఏపీ సీఎం జగన్‌. అమ్మ ఒడి, సంపూర్ణ ఫీజు రియింబర్స్‌ మెంట్, విద్యార్థులకు బోర్డింగ్‌ అండ్‌ లాడ్జింగ్‌ కింద ఏటా 20వేల రూపాయలు చెల్లింపుపై అధికారులతో చర్చించారు. వచ్చే జనవరి 26 నుంచి అమ్మ ఒడి అమలు చేస్తామన్నారు. స్కూలు దగ్గర నుంచి తిరిగి ఉన్నత విద్య పూర్తి చేసుకునేంత వరకూ డ్రాప్‌ అవుట్‌ లేకుండా చేయాలన్నారు సీఎం జగన్‌

రాష్ట్రంలో 40వేల స్కూళ్లు ఉన్నాయన్న ఆయన... ప్రతి స్కూలును అభివృద్ధి చేస్తామన్నారు. . బాత్‌రూమ్స్, తాగునీరు, ఫర్నిచర్, బ్లాక్‌బోర్డ్స్, ఫ్యాన్లు, ప్రహరీ గోడలు, ఫినిషింగ్‌ వర్క్స్‌... ఇలా ప్రతి పనీ ప్రాధాన్యతా క్రమంలో చేపడతామన్నారు. ప్రతి పాఠశాలను ఇంగ్లిషు మీడియం చేస్తున్నామని ..... తెలుగు భాషను తప్పనిసరి సబెక్ట్‌ చేస్తున్నట్లు తెలిపారు.

ఇక... మధ్యాహ్నభోజనం నాణ్యతను బాగా పెంచుతామన్నారు. ప్రతి విద్యార్ధికి 3 జతల యూనిఫారాలు, షూలు అందిస్తామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకే స్టిచ్చింగ్‌ ఛార్జీలు ఇస్తున్నట్లు తెలిపారు. పిల్లలకు షూలు, సాక్సులకోసం డబ్బులు కూడా ఇస్తామన్నారు. అర్బన్‌ ప్రాంతాల్లో మధ్యాహ్నం భోజనం అక్షయపాత్రకు, రూరల్‌ ప్రాంతాల్లో ఇప్పుడున్న డ్వాక్రా గ్రూపులకు అప్పగిస్తామన్నారు.

ప్రతి పాఠశాలకు విద్యాకమిటీ ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాల అభివృద్ది, పర్యవేక్షణ బాధ్యత ఈ కమిటీదేనన్నారు. క్రమం తప్పకుండా సమావేశమై స్కూలు బాగోగులను విద్యా కమిటీలు పర్యవేక్షించాలన్నారు. స్కూలు, కాలేజీ ఫీజుల మానిటరింగ్‌ అండ్‌ రెగ్యులేటరి కోసం ఒక నియంత్రణ వ్యవస్థను తీసుకొస్తున్నామన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టాన్ని తీసుకొస్తామన్నారు సీఎం. ఇక వంద శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తామన్నారు.

బోర్డింగ్‌, లాడ్జింగ్‌ కోసం ప్రతి విద్యార్థికి ఏటా 20 వేలు అందిస్తామన్నారు. ఏదశలో కూడా చదువు ఆపకూడదన్నదే తమ లక్ష్యమన్నారు సీఎం జగన్‌. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని అసెంబ్లీ చట్టం తీసుకొస్తున్నట్లు తెలిపారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఓ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ను ఎంపిక చేసుకుని, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో ఉన్నవారికి శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story